మారుతున్న టెక్నాలజీ ప్రకారం బ్యాంకింగ్ రంగంలో కీలకమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా బ్యాంకులు తమ ఖాతాదారులకు క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తాయి. అత్యవసర సమయంలో వాడుకోడానికి, కార్డు ద్వారా నగదు రహిత చెల్లింపులకు ఉపయోగపడతాయని చాలా మంది విరివిగా క్రెడిట్ కార్డులు తీసుకుంటారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగంలోని ఉద్యోగస్తులు ఎక్కువగా క్రెడిట్ కార్డులు తీసుకుంటారు. ఎందుకంటే క్రెడిట్ కార్డులతో షాపింగ్‌లు చేయడంతో పాటు రెంట్ పేమెంట్స్, ఇతర బిల్లులు కట్టడానికి ఉపయోగకరంగా ఉంటుందని వారి భావన. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్ & పేమెంట్ సర్వీసెస్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు, ఫీజులను సవరించింది. కొత్త ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు 17 మార్చి 2023 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఎస్‌బీఐ ప్రాసెసింగ్ ఫీజు రూ.99 నుంచి రూ.199 కు పెంచినట్లు కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది. వీటితో పాటు ట్యాక్సులు అదనంగా ఉంటాయని తెలిపింది. పెంచిన చార్జీలపై అవగాహన కల్పించేలా ఇప్పటికే ఎస్‌బీఐ కస్టమర్లకు మెయిల్స్ పంపింది.
ఎస్‌బీఐ సింప్లీ క్లిక్ కార్డ్ హోల్డర్ల కోసం జనవరి 2023 నుంచి కొన్ని నియమాలను సవరించారు. వోచర్, రివార్డ్ పాయింట్ల రిడీమ్‌కు సంబంధించి రెండు నియమాలు ఉంటాయి. సింప్లి క్లిక్ క్లియర్‌ట్రిప్ వోచర్ ఒకే లావాదేవీలో మాత్రమే రీడీమ్ చేయాలని సవరించింది. అయితే ఈ ఆఫర్ మరే ఇతర ఆఫర్/వోచర్‌తో కలిపి ఉండకూడదని కంపెనీ వెబ్‌సైట్‌లో తెలిపారు. అలాగే అమెజాన్ వెబ్‌సైట్‌లో ఎస్‌బీఐ కార్డు ద్వారా చేసే చెల్లింపులకు సంబంధించి ఇచ్చే రివార్డు పాయింట్లను 10 X నుంచి 5Xకు సవరించింది. అయితే అపోలో 24X7, నెట్ మెడ్స్, క్లియర్ ట్రిప్ వంటి సైట్ల ద్వారా అందించే పాయింట్లను మాత్రం యథాతధంగా అమలు చేస్తుంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి