కరోనా ఎఫెక్ట్: పెరగనున్న స్మార్ట్ ఫోన్స్, టీవీల ధరలు !

| Edited By:

Feb 25, 2020 | 1:38 PM

కొవిడ్ మహ్మమారి ఇప్పుడు ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఎక్కడో చైనాలో పుట్టిన కొవిడ్..మనుషులతో పాటు, జంతుజీవాలపై కూడా పంజా విసురుతోంది. కొవిడ్ వైరస్ కారణంగా వ్యాపార, వాణిజ్య రంగాలు కూడా అతలాకుతలం అవుతున్నాయి.

కరోనా ఎఫెక్ట్: పెరగనున్న స్మార్ట్ ఫోన్స్, టీవీల ధరలు !
Follow us on

కరోనా ఎఫెక్ట్: కొవిడ్ మహ్మమారి ఇప్పుడు ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఎక్కడో చైనాలో పుట్టిన కొవిడ్..మనుషులతో పాటు, జంతుజీవాలపై కూడా పంజా విసురుతోంది. కొవిడ్ వైరస్ కారణంగా వ్యాపార, వాణిజ్య రంగాలు కూడా అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటికే వైరస్ నేపథ్యంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కోళ్లు, చేపలు వంటి మాంసం వ్యాపారాలపై కొవిడ్ ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా ఈ వైరస్ భూతం ఇప్పుడు ఎలక్ట్రానిక్ రంగాలపై కూడా పంజా విసురుతోంది. నిలిచిపోయిన ఎగుమతులు, దిగుమతుల కారణంగా వ్యాపారం కుదేలవుతోంది.

ప్రపంచంలోనే చైనాలో తయారైన ఎలక్ట్రానిక్ పరికరాలకు గిరాకీ ఎక్కువ. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా రోజుకో కొత్త కొత్త ఎలక్ట్రానిక్ పరికరాన్ని రిలీజ్ చేస్తూ ప్రపంచ మార్కెట్లో గట్టి పోటీ ఇస్తోంది. కానీ, కొవిడ్ -19 కారణంగా ఇప్పుడు చైనాలో చాలా వరకు ఉత్పత్తి సంస్థలు మూతపడ్డాయి. వైరస్ ప్రబలకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అటు, శాంసంగ్‌ మూతపడింది. యాపిల్ సంస్థ చైనాలో తన అన్ని రిటైల్ స్టోర్లు, కార్పొరేట్ కార్యాలయాలకు తాళం వేసింది.

చైనాలో శాంసంగ్‌ సంస్థ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. 800 స్క్వేర్ మీటర్ల విస్తీరణంలో ఉన్న ఈ స్టోర్ చైనాలోని అతిపెద్ద శాంసంగ్ స్టోర్. గతేడాది అక్టోబరులో ప్రారంభమైన ఇక్కడి స్టోర్లో స్మార్ట్‌ఫోన్ల నుంచి వివిధ రకాల ఉత్పత్తుల అమ్మకాలు జరుగుతుంటాయి. ఈ స్టోర్ మళ్లీ ఎప్పుడు తెరవాలన్నది చైనాలోని పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. యాపిల్ సంస్థ కూడా వైరస్ విజృంభిస్తుండడంతో మెయిన్‌ల్యాండ్ చైనాలోని అన్ని రిటైల్ స్టోర్లు, కార్పొరేట్ కార్యాలయాలను మూసివేసింది.

ఎలక్ట్రానిక్ పరికరాలు, సబ్‌ అసెంబ్లీస్‌ కోసం చైనాపై ఆధారపడిన దేశీ కంపెనీలకు సరఫరా సమస్యల సెగ తగులుతోంది. చైనా దిగుమతులు పూర్తిగా నిలిచిపోవటంతో ఇతర దేశాల వస్తువులకు డిమాండ్ పెరుతోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరిగిపోయే అవకాశం కనిపిస్తోంది. చైనాలో తయారయ్యే ఈ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల విడిభాగాల ధరలు పెరగటం, సరఫరాలు దెబ్బతిన్న నేపథ్యంలో ధరలు పెరగవచ్చునని చెబుతున్నారు. చైనాలో మూతబడిన ఫ్యాక్టరీలు తిరిగి తెరుచుకుని, దిగుమతులు ప్రారంభిస్తేనే…పరిస్థితి చక్కబడే అవకాశం ఉందంటున్నారు వ్యాపార నిపుణులు.