
భారతదేశంలో యూపీఐ సేవలు అధిక ప్రజాదరణ పొందడంతో ఆన్‌లైన్ చెల్లింపుల్లో కీలక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా పట్టణాల్లో ప్రధాన లావాదేవీల విధానంగా యూపీఐ మారింది. అయితే ఈ చెల్లింపుల్లో డెబిట్ కార్డ్‌లు నిరుపయోగంగా మారినా క్రెడిట్ కార్డులు మాత్రం ఇంకా ప్రజలు వినియోగిస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్‌లో డెబిట్ కార్డ్‌ల కంటే క్రెడిట్ కార్డ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. జనవరిలో రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదికలో దేశంలో దాదాపు 10 కోట్ల క్రెడిట్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయని పేర్కొంది. క్రెడిట్ కార్డ్‌లు స్వల్పకాలిక ఫైనాన్సింగ్‌ను అందిస్తాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డు మూసేయాలనుకుంటే మోసపోయే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి క్రెడిట్ కార్డు వినియోగదారులు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో? ఓ సారి తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డులు మీరు చేసిన కొనుగోళ్లకు వెంటనే చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. మీరు కాలక్రమేణా లేదా అత్యవసర పరిస్థితుల్లో చెల్లింపులు చేయాలనుకున్నప్పుడు క్రెడిట్ కార్డులు సాయం చేస్తాయి. నిర్దిష్ట క్రెడిట్ కార్డ్‌లు వినోదం, పెట్రోల్ లేదా విమాన ఛార్జీలతో సహా నిర్దిష్ట ఖర్చులపై ఎక్కువ క్యాష్‌బ్యాక్ క్రెడిట్‌లను అందిస్తాయి. దీంతో క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగింది. అయితే క్రెడిట్ కార్డ్‌లతో అతి పెద్ద ప్రమాదం ఎక్కువ ఖర్చు చేయడం. అలాగే మీరు భరించగలిగే దానికంటే ఎక్కువ ఖర్చు చేయడం వల్ల మీరు అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. చాలా మంది వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్‌లను మూసివేయడానికి ఇదే కారణండి ఉంటుంది. అయితే మీ క్రెడిట్ కార్డ్‌ను మూసివేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఎస్‌బీఐ కార్డు కోసం ఓ థర్డ్‌పార్టీ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి కార్డు క్లోజ్ పేరుతో వ్యక్తుల నుంచి వివరాలు అడిగి రూ.14 లక్షలు మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
మీ క్రెడిట్ కార్డ్‌ని మూసేస్తున్నప్పుడు మీరు మీ ఓటీపీ, సీవీవీ లేదా ఇతర వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదు. మీరు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించకూడదనుకుంటే, అన్ని బకాయిలు చెల్లించినట్లయితే కార్డుదారుని కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేయాలి. కార్డును మూసివేయమని అక్కడ ఉన్న కస్టమర్ కేర్ ఉద్యోగిని అభ్యర్థించాలి. బ్యాంక్ ఉద్యోగి మీ అభ్యర్థనను ఆమోదించి కార్డ్ సమాచారాన్ని సిస్టమ్‌లోకి అందించిన వెంటనే మీరు అప్లికేషన్‌కు సంబంధించిన సందేశాన్ని అందుకుంటారు.
మీ క్రెడిట్ కార్డ్‌ను మూసివేయమని అభ్యర్థించడానికి కస్టమర్ సర్వీస్‌కు సంబంధించిన ఈ-మెయిల్‌ను చేయాల్సి ఉంటుంది. అటాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మీరు కార్డ్ రివర్స్‌లో సూచించిన మెయిల్ ఐడీని ఉపయోగించి మీ అభ్యర్థనను కూడా సమర్పించవచ్చు. మెయిల్‌లో ప్రతిస్పందన వస్తుంది. అలాగే బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ జారీ చేసేవారు మీ దరఖాస్తును ఆమోదించిన వెంటనే కార్డ్‌ను మూసివేయడం ప్రక్రియ ప్రారంభమవుతుంది. బ్యాంక్ ఉద్యోగితో లేదా క్రెడిట్ కార్డ్‌ను మూసివేసే ప్రతినిధితో మాట్లాడుతున్నప్పుడు కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలను వారికి ఎప్పుడూ ఇవ్వకూడదు. సాధారణంగా పేరు, పుట్టిన తేదీ కాకుండా కార్డులోని చివరి 4 అంకెలు మాత్రమే అడుగుతారు. ఎవరైనా అదనపు సమాచారం కోసం అడిగితే వెంటనే వారు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని గుర్తించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి