మీరు ఎవరికైనా చెల్లించడానికి చెక్కును ఉపయోగిస్తే అనేక విషయాలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. లేదంటే చెక్ బౌన్స్ అయితే భారీ జరిమానా చెల్లించాల్సి రావచ్చు. దీంతో పాటు జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంటుంది. అందుకే చెక్ బౌన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చెక్ బౌన్స్ అయితే కోర్టు చట్టపరమైన నేరంగా పరిగణిస్తుంది. ఇందులో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 ప్రకారం జరిమానాతో పాటు శిక్ష విధించే నిబంధనను రూపొందించారు. కొన్ని కారణాల వల్ల బ్యాంక్ చెక్‌ను తిరస్కరించినప్పుడు, చెల్లింపు జరగనప్పుడు, అది చెక్ బౌన్స్‌గా పరిగణిస్తారు. ఇలా జరగడానికి కారణం చాలా వరకు ఖాతాల్లో బ్యాలెన్స్ లేకపోవడమే. అంతే కాకుండా వ్యక్తి సంతకంలో తేడా వచ్చినా బ్యాంకు చెక్కును తిరస్కరిస్తుంది. దీని కారణంగా మీరు అనేక సమస్యలను ఎదుర్కొవలసి రావచ్చు.
చెక్ బౌన్స్ అయినప్పుడు, చెక్కు ఇస్తున్న వ్యక్తి దాని గురించి తెలియజేయాలి. ఆ తర్వాత అతను మీకు 1 నెలలోపు చెల్లించాలి. అలా చేయడంలో విఫలమైతే వ్యక్తికి లీగల్ నోటీసు పంపిస్తారు. ఆ తర్వాత కూడా 15 రోజుల వరకు స్పందన రాకపోతే అతనిపై నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్, 1881లోని సెక్షన్ 138 కింద కేసు నమోదు చేస్తారు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881 ప్రకారం.. వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయవచ్చు. అలాగే చెక్ డ్రాయర్‌కు రెండేళ్ల వరకు శిక్ష విధించవచ్చు.
చెక్కులు, బ్యాంక్ డ్రాఫ్ట్‌లు ప్రస్తుతం వాటి జారీ నుండి 3 నెలల వరకు చెల్లుబాటు అవుతాయి. 3 నెలల కంటే ఎక్కువ అయితే అది చెల్లనిదిగా పరిగణిస్తారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి