
గ్రామీణ ఉపాధి రంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా “విక్సిత్ భారత్–రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) చట్టం–2025”ను తీసుకురానుంది. ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మే 23న విడుదల చేసి ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియ జూన్ 20 వరకు కొనసాగనుంది. జూలై 1 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కొత్త చట్టాన్ని అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ నిబంధనలు గ్రామీణ ఉపాధి హామీ వ్యవస్థలో పలు కీలక మార్పులకు దారితీయనున్నాయి.
ప్రతిపాదిత నిబంధనల ప్రకారం కొత్త చట్టం కింద జాతీయ స్థాయి స్టీరింగ్ కమిటీ, కేంద్ర గ్రామీణ ఉపాధి హామీ మండలి, పరిపాలనా వ్యయాలు, వేతనాల చెల్లింపులు, నిరుద్యోగ భృతి, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వంటి అంశాలకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించారు. అలాగే కేటాయించిన నిధులను మించి జరిగే ఖర్చుల పర్యవేక్షణకు కూడా ప్రత్యేక నిబంధనలు చేర్చారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ నుంచి కొత్త వ్యవస్థకు మారే ప్రక్రియలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రత్యేక పరివర్తన నిబంధనలు రూపొందించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, పెండింగ్ బకాయిల పరిష్కారం, రికార్డుల బదిలీ, ఈ-కేవైసీ ఆధారిత జాబ్‌కార్డుల చెల్లుబాటు వంటి అంశాలను ఈ నిబంధనల్లో పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులు, పౌరసంఘాలు, ప్రజల నుంచి సూచనలు స్వీకరించిన తర్వాత తుది నిబంధనలను ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ ఉపాధి వ్యవస్థను మరింత పారదర్శకంగా, సాంకేతిక ఆధారితంగా మార్చడమే ఈ కొత్త చట్టం లక్ష్యమని కేంద్రం పేర్కొంటోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి