
దేశంలో వాణిజ్య, పారిశ్రామిక రంగానికి ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ (LPG) సరఫరాపై ఉన్న అన్ని రకాల ఆంక్షలను తక్షణమే ఎత్తివేసింది. గృహేతర ప్యాకేజ్డ్ ఎల్‌పీజీ సరఫరాపై గతంలో విధించిన రంగాల వారీ పరిమితులను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల తర్వాత తలెత్తిన అంతర్జాతీయ సంక్షోభానికి ముందు ఎలాంటి పరిస్థితులు ఉండేవో.. ఇప్పుడు ఎల్‌పీజీ సరఫరా మళ్లీ అదే యధాస్థితికి చేరుకుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వం ఆంక్షలను సడలించడంతో సంక్షోభం ప్రారంభంలో నిలిచిపోయిన బల్క్ ఎల్‌పీజీ సరఫరాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పునఃప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వీటిని సంక్షోభానికి ముందున్న వినియోగంలో 50 శాతానికి పునరుద్ధరించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల హోటళ్లు, పరిశ్రమలు, భారీ వాణిజ్య సంస్థలకు ఇంధన లభ్యత పెరిగి భారీ ఉపశమనం కలగనుంది.
అంతర్జాతీయ సంక్షోభ సమయంలో దేశీయంగా ఎల్‌పీజీ కొరత రాకుండా చూసేందుకు చర్యలు చేపట్టింది. ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతంలో నిత్యావసర వస్తువుల చట్టం కింద ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారం.. రిఫైనరీల నుండి వచ్చే C3-C4 (ప్రొపేన్ – బ్యూటేన్) స్ట్రీమ్‌లను కేవలం ఎల్‌పీజీ ఉత్పత్తికి మాత్రమే ఉపయోగించాలనే నిబంధన విధించింది. దీనికోసం పెట్రోకెమికల్ మరియు ఇతర అనువర్తనాల నుండి ఆ స్ట్రీమ్‌లను పూర్తిగా ఎల్‌పీజీ వైపు మళ్లించారు.
ప్రస్తుతం దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తి గణనీయంగా మెరుగుపడటంతో పాటు, విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ఎల్‌పీజీ కార్గోలు కూడా దేశానికి చేరుకుంటున్నాయి. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో, ఎల్‌పీజీ పూల్‌లో C3-C4 స్ట్రీమ్‌ల వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఇకపై ఆ స్ట్రీమ్‌లను యధావిధిగా పెట్రోకెమికల్స్ మరియు ఇతర కీలక పారిశ్రామిక రంగాల అవసరాలకు ఎక్కువగా కేటాయించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం పూర్తిగా వాణిజ్య, పారిశ్రామిక ఎల్‌పీజీ, పెట్రోకెమికల్ రంగానికి మాత్రమే వర్తిస్తుంది. దీనివల్ల సామాన్య ప్రజలు ఇళ్లలో ఉపయోగించే గృహ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి కొరత ఉండదని, అలాగే వాటి ధరలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడబోదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…