
కేంద్ర ప్రభుత్వం డీజిల్ కొనుగోళ్లపై సడెన్ డెసిషన్ తీసుకుంది. ఈ మేరకు పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొనుగోళ్లపై పరిమితులు విధించింది. ఇక నుంచి ఎంత కావాలంటే అంత డీజిల్ నింపుకోవడానికి వీలు ఉండదు. ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి వరకు మాత్రమే డీజిల్ కొనుగోలు చేసే అవకాశముంటుంది. ఈ మేరకు అన్నీ చమురు కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ “మోటార్ స్పిరిట్, హై-స్పీడ్ డీజిల్ (రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా సరఫరాకు తాత్కాలిక నియంత్రణ) ఆర్డర్, 2026ను జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం పలు కఠిన నిబంధనలు విధించింది.
డీజిల్ అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం రోజువారి పరిమితి విధించింది. ఒక వ్యక్తి ఏ వాహనానికైనా ఒక్కరోజులో గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే కొనుగోలు చేయడానికి వీలుంటుంది. అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసేందుకు సాధ్య పడదు. అంతేకాకకుండా కొనుగోలు చేసిన డీజిల్‌ను వినియోగదారుడు తిరిగి విక్రయించడంపై నిషేధం అమల్లోకి తెచ్చింది. డీజిల్ బ్లాక్ మార్కెటింగ్ అడ్డుకోవడం, నిల్వల లభ్యతను పెంచడం కోసం కేంద్రం ఈ రూల్స్ తీసుకొచ్చింది. 90 రోజుల వరకు ఈ కొత్త నిబంధనలు అమల్లో ఉంటాయి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై నిత్యావసర వస్తువుల చట్టం, 1955, ఇతర వర్తించే చట్టాల ప్రకారం జరిమానా విధించడం, ఇతర చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో వినియోగదారులకు డీజిల్ లభ్యతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
-పెట్రోల్ బంకుల్లో సిబ్బంది డీజిల్‌ను వాహన ట్యాంకులలో లేదా PESO ఆమోదించిన కంటైనర్లలో మాత్రమే అందించాలి
– ప్రతి కస్టమర్ లేదా వాహనానికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల వరకు మాత్రమే డీజిల్ విక్రయించాలి
–రిటైల్ అవుట్‌లెట్‌లలో కొనుగోలు చేసిన డీజిల్‌ను తిరిగి అమ్మకూడానికి వీల్లేదు
-పారిశ్రామిక, ప్రత్యక్ష, సంస్థాగత, వాణిజ్య వినియోగదారులు రిటైల్ అవుట్‌లెట్‌ల నుండి ఇంధనాన్ని కొనుగోలు చేయకూడదు
-పెద్ద వాణిజ్య వినియోగదారులు కన్స్యూమర్ పంపుల ద్వారానే డీజిల్ పొందాలి
-చాలామంది పెద్ద వ్యాపారులు పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల సామాన్య వినియోగదారుడికి లభ్యత తగ్గుతుంది. టోకు మార్కెట్ కంటే రిటైల్ అవుట్ లెట్లలో పెట్రోల్ ,డీజిల్ ధరలు తక్కువగా ఉండటంతో రవాణా సంస్థలు, ఇతర పెద్ద వ్యాపార వినియోగదారులు పెట్రోల్ బంకుల్లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో పెద్ద వ్యాపారులు రిటైల్ అవుట్‌లెట్లలో డీజిల్ కొనుగోలు చేయడంపై నిషేధం విధించింది.