
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం సౌర మాడ్యూల్ తయారీ రంగంలో గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది. అధిక సామర్థ్యం గల సౌర PV మాడ్యూళ్ల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రారంభించబడిన ఈ పథకం అక్టోబర్ 2025 నాటికి దేశంలో సుమారు 43,000 ఉద్యోగాలను సృష్టించింది. వీటిలో 11,220 ప్రత్యక్ష ఉద్యోగాలు కాగా, మిగిలినవి అనేక రాష్ట్రాలలో సృష్టించబడిన పరోక్ష ఉద్యోగాలు అని లోక్‌సభలో సమర్పించిన ప్రభుత్వ డేటా తెలిపింది.
ప్రభుత్వం ప్రకారం.. ఈ పథకం కింద, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఒడిశా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సోలార్ మాడ్యూల్ ఉత్పత్తి యూనిట్లు స్థాపించారు. గుజరాత్ అతిపెద్ద లబ్ధిదారుగా ఉంది, ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ న్యూ ఇండస్ట్రీస్, ఇతర కంపెనీల మెగా ప్రాజెక్టులు 22,400 కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టించాయి.
FS ఇండియా సోలార్ వెంచర్స్, VSL గ్రీన్ పవర్, TP సోలార్ యూనిట్ల ద్వారా సుమారు 6,800 ఉద్యోగాలను సృష్టించి తమిళనాడు రెండవ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 1,620 ఉద్యోగాలను సృష్టించగా, ఒడిశా AMPIN సోలార్ ద్వారా 200 ఉద్యోగాలను సృష్టించింది. ReNew Photovoltaics, Grew Energy, Avada Electro వంటి కంపెనీలు అనేక రాష్ట్రాల్లో చేపట్టిన ప్రాజెక్టులు కూడా ఉపాధికి దోహదపడ్డాయి.
ఈ ప్రభుత్వ PLI పథకాన్ని రూ.24,000 కోట్ల బడ్జెట్‌తో అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు 48.3 GW సామర్థ్యంతో పూర్తిగా లేదా పాక్షికంగా ఇంటిగ్రేటెడ్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు ఈ పథకం కింద ఆమోదించారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ALMM ప్రకారం.. ఇన్‌స్టాల్ చేసిన సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యం 121.68 GWకి చేరుకుంది. దేశీయ ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ, భారతదేశం 2025-26 మొదటి అర్ధభాగంలో దాదాపు 386 మిలియన్ డాలర్ల విలువైన 18.058 మిలియన్ సోలార్ మాడ్యూల్‌లను దిగుమతి చేసుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి