దేశ మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. అనేక ప్రత్యేకతలతో వివిధ కంపెనీలు తయారు చేస్తున్న కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. అధిక రేంజ్, మెరుగైన ఇంజిన్, మంచి బ్యాటరీ సామర్థ్యం కలిగిన వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్ లో పోటీకి అనుగుణంగా బీఎండబ్ల్యూ కంపెనీ తన కొత్త కారును దేశంలోకి విడుదల చేసింది. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 635 కిలోమీటర్లు దూసుకుపోవచ్చు. దీనిలో ఇంకా అనేక స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి.
ప్రముఖ జర్మన్ ఆటో కంపెనీ అయిన బీఎండబ్ల్యూ కొత్త కారును విడుదల చేసింది. బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎస్ యూవీ సిరీస్ లో కొత్త వేరియంట్ ఇది. ఈ కారుకు అనేక ప్రత్యేకతలున్నాయి. దీన్ని పూర్తిగా ఎక్స్ డ్రైవ్ 50 టెక్నాలజీతో రూపొందించారు. మన దేశంలో ఈ కారు రూ.1.39 కోట్లకు (ఎక్స్ షోరూమ్) అందుబాటులో ఉంది. కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సీబీయూ) అనే కొత్త పద్ధతితో తయారు చేశారు. దేశంలోని బీఎండబ్ల్యూ అధీకృత డీలర్లు, లేదా కార్ల తయారీదారుల అధికారిక వెబ్ సైట్లలో బుక్కింగ్ చేసుకోవచ్చు. దేశ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ లో ఆడి ఇ-ట్రాన్, మెర్సిడెస్‌బెంజ్ ఇక్యూసి, పోర్షే టైకాన్ తదితర కార్లకు బీఎండబ్ల్యూ గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
బీఎండబ్ల్యూ కంపెనీ ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ కారును 2021లోనే మొదటి వేరియంట్ ను లాంచ్ చేసింది. కాగా దీని అప్ డేటెడ్ వెర్షన్లు అయిన ఎక్స్ డ్రైవ్50 వేరియంట్ తో పాటు ఎక్స్ డ్రైవ్40 వెర్షన్ కారు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ రెండింటి మధ్య ధర వ్యత్యాసం కేవలం దాదాపు రూ.29 లక్షలు. ఎక్స్ డ్రైవ్40 వెర్షన్ రూ. 1.20 కోట్లకు (ఎక్స్ షోరూమ్) లభిస్తుంది.
ఎక్స్ డ్రైవ్50 ఎలక్ట్రిక్ ఎస్ యూవీ కారు 111.5 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల డ్యూయల్ బ్యాటరీ సెటప్‌తో వస్తుంది. ఈ బ్యాటరీలకు ఎనిమిదేళ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వరకూ వారంటీ వర్తిస్తుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 635 కిలోమీటర్ల ప్రయాణించవచ్చు. ట్విన్ ఎలక్ట్రిక్ మోటారు కారణంగా ఇంజిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది. 515 బీహెచ్పీ శక్తి, 765 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.6 సెకన్లలో అందుకుంటుంది. మరో కారు ఎక్స్ డ్రైవ్40 విషయానికి వస్తే 321 బీహెచ్ పీ శక్తి, 630 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 414 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. ఈ కారు 6.1 సెకన్లలో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
ఎక్స్ డ్రైవ్50 ఎలక్ట్రిక్ ఎస్ యూవీ కారును చాలా వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. 95 కేడబ్ల్యూ డీసీ అనే ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగిస్తే కేవలం 35 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం రీచార్జ్ అవుతుంది. అత్యవసర సమయంలో కేవలం పది నిమిషాలు చార్జింగ్ పెట్టి, 145 కిలోమీటర్లు ప్రయాణింవచ్చు. అలాగే 50 కేడబ్ల్యూ డీసీ చార్జర్ ను ఉపయోగిస్తే 1.30 గంటలలోపు చార్జింగ్ పూర్తవుతుంది. ఇంట్లో 11 కేడబ్ల్యూ ఏసీ చార్జర్ ను ఉపయోగించవచ్చు. దీని ద్వారా రీచార్జి చేయడానికి 11 గంటలు పడుతుంది. 22 కేడబ్ల్యూ ఏసీ చార్జర్ ను వాడితే 5.30 గంటల్లోనే పని పూర్తవుతుంది. బీఎండబ్ల్యూ కంపెనీ తన ఐఎక్స్ కస్టమర్లందరికీ 22 కేడబ్ల్యూ చార్జర్ ను వాల్‌బాక్స్ యూనిట్‌గా అందించి, ఇన్‌స్టాల్ చేయనుంది. ఎక్స్ డ్రైవ్50 ఎలక్ట్రిక్ ఎస్ యూవీ కారు మినరల్ వైట్, ఫైటోనిక్ బ్లూ, బ్లాక్ సఫైర్, అవెన్చురిన్ రెడ్, ఆక్సిడ్ గ్రే రంగుల్లో లభిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..