
వరి సాగులో పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్న ఈ రోజుల్లో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, అధిక దిగుబడులు సాధించడం రైతులకు పెద్ద సవాలుగా మారింది. అయితే ప్రకృతి ప్రసాదించిన నీలి-ఆకుపచ్చ నాచు అనే సహజ సూక్ష్మజీవ ఎరువు దీనికి చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది. నేల సారాన్ని పెంచడంతో పాటు పంట దిగుబడిని పెంచడంలో ఇది అద్భుతంగా తోడ్పడుతుందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. సయనోబాక్టీరియా అని పిలువబడే ఈ సూక్ష్మజీవులకు గాలిలోని నత్రజనిని గ్రహించి నేలలో స్థిరీకరించే అరుదైన సామర్థ్యం ఉంది. దీనివల్ల నేలలో సేంద్రియ పదార్థం పెరిగి, నేల సారవంతంగా మారి వరి పంట ఏపుగా పెరగడానికి ఎంతగానో సహాయపడుతుంది.
రైతులు స్వయంగా ఈ నాచును సులభంగా ఇంట్లోనే లేదా పొలం వద్ద తయారు చేసుకోవచ్చు.
నారుమడి తయారీ: బాగా ఎండ తగిలే ప్రదేశంలో ఒక సెంటీమీటర్ లోతు ఉండేలా నారుమడిని ఏర్పాటు చేయాలి.
నీటి సదుపాయం: మట్టి కలిపిన 3 నుండి 5 అంగుళాల నీటితో ఈ నారుమడిని నింపాలి.
నేల పోషణ: ఆ తర్వాత సూపర్‌ఫాస్ఫేట్, అవసరమైతే సున్నం ఉపయోగించి మట్టిని సిద్ధం చేయాలి.
మిశ్రమం చల్లడం: ఎరువు, ఇసుకతో కలిపిన నీలి-ఆకుపచ్చ నాచును మిశ్రమాన్ని సమానంగా చల్లాలి.
రక్షణ – సేకరణ: కీటకాల దాడి జరిగితే సిఫార్సు చేసిన మోతాదులో పురుగుమందులు వాడుతూ సంరక్షిస్తే, 20 నుండి 30 రోజుల్లో నాచు తయారవుతుంది. నారుమడి ఆరిన తర్వాత పైభాగంలో ఆకుపచ్చగా, అడుగున మట్టితో కూడిన ఈ నాచును సేకరించి, బాగా ఆరబెట్టి గోనె సంచులలో నిల్వ చేసుకోవచ్చు.
వరి నాటిన 7 నుండి 10 రోజులలోపు ఈ నాచును పొలంలో వేయడం మంచిది. హెక్టారుకు 10 కిలోల నీలి-ఆకుపచ్చ శైవలాన్ని, 25 కిలోల పశువుల ఎరువు లేదా 25 కిలోల ఇసుకతో కలిపి పొలంలో చల్లుకోవాలి. ఇది పొలంలో వేగంగా వ్యాపించి, కలుపు మొక్కలు, ఇతర అనవసరమైన శైవలాల పెరుగుదలను అరికడుతుంది. అంతేకాకుండా నేలకు ఏకంగా 10 నుండి 30 కిలోల నత్రజనిని అందుబాటులోకి తీసుకువస్తుంది.
యూరియా ఖర్చుకు చెక్: ఈ శైవలాన్ని 3 నుండి 4 వరి సీజన్ల పాటు నిరంతరంగా ఉపయోగిస్తే రసాయన ఎరువుల అవసరాన్ని సుమారు 25 శాతం వరకు తగ్గించుకోవచ్చు.
దిగుబడి పెంపు: ఈ బయో ఫెర్టిలైజర్ వాడకం వల్ల వరి దిగుబడి 15 నుండి 20 శాతం వరకు పెరుగుతుంది.
దీర్ఘకాలిక ప్రయోజనం: దీని ప్రయోజనాలు కేవలం వాడిన ఒక్క సీజన్‌కే పరిమితం కాకుండా ఆ తర్వాతి వరి సాగు సీజన్లలో కూడా నేలను సారవంతంగా ఉంచి అధిక దిగుబడులకు దోహదపడతాయి.
తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందించే ఈ నీలి-ఆకుపచ్చ నాచు వాడకాన్ని పెంచి, సేంద్రియ పద్ధతుల్లో అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ నిపుణులు కోరుతున్నారు.