
భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. డిజిటల్ లావాదేవీల్లో మెజార్టీ వాటా యూపీఐదే ఉందని చెప్పవచ్చు. దీంతో యూపీఐ వాడేవారి కోసం ఫిన్‌టెక్ కంపెనీలు అనేక ఆఫర్లు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ భారత్ పే యూపీఐ కస్టమర్ల కోసం అదిరిపోయే కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. భారత్‌పే, యెస్ బ్యాంక్ సంయుక్తంగా ‘భారత్‌పే ఫ్లెక్స్’ను ప్రవేశపెట్టాయి. దీని ద్వారా యూపీఐ క్రెడిట్ లైన్‌ను పొందవచ్చు.
బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేనప్పుడు యూపీఐ ద్వారా చెల్లింపు చేయవచ్చు. ఆ తర్వాత తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 45 రోజుల పాటు ఎలాంటి వడ్డీ ఉండదు. క్రెడిట్ కార్డు తరహాలో ఈ ఫీచర్ ఉంటుంది. ఈ కాలంలో వినియోగదారులు తమ ఖర్చులను బిల్లింగ్ సైకిల్‌లోనే చెల్లించవచ్చు. అలాగే 3 నుండి 12 నెలల EMIలుగా మార్చుకుని అయినా చెల్లించవచ్చు. క్యూఆర్ కోడ్ స్కానింగ్, ఆన్‌లైన్ షాపింగ్, బిల్లు చెల్లింపులు, మొబైల్ రీఛార్జ్‌లు, ప్రయాణ బుకింగ్‌లు, పెట్రోల్ కొనుగోళ్లు, ఇతర రోజువారీ ఖర్చుల కోసం క్రెడిట్ లైన్ అనేది వాడుకోవచ్చు.
ముందుగా యాప్‌లోకి వెళ్లి క్రెడిట్ లైన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అర్హులైన కస్టమర్లకు మూడు నిమిషాల్లో ఈ ఫీచర్ యాక్టివేట్ చేస్తారు. వినియోగదారులు యాప్‌లోనే తమ ఖర్చులను, అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితిని, తిరిగి చెల్లింపులను ట్రాక్ చేయవచ్చు. కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం మీ క్రెడిట్ లైన్‌ను యూపీఐకి లింక్ చేసి యూపీఐ పిన్‌ను సెట్ చేసుకోవాలి. అనంరతం యూపీఐ మర్చంట్‌ల వద్ద చెల్లింపులు చేయవచ్చు. అలాగే భారత్‌పే యూపీఐ రివార్డ్స్ కింద అర్హత గల లావాదేవీలపై రివార్డులు కూడా పొందవచ్చు.