సీనియర్ సిటిజన్లకు వరంలా మారిన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు! అధిక వడ్డీలతో..

ద్రవ్యోల్బణం, మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య వయోవృద్ధులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు) నమ్మదగిన పెట్టుబడి. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు 5 సంవత్సరాల ఎఫ్‌డీలపై 8.05 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. అధిక వడ్డీతో పాటు బ్యాంకు స్థిరత్వం, రూ. 5 లక్షల డిపాజిట్ బీమా (DICGC) ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

సీనియర్ సిటిజన్లకు వరంలా మారిన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు! అధిక వడ్డీలతో..
Senior Citizen Fd

Updated on: May 10, 2026 | 6:02 AM

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు) వయోవృద్ధులకు అత్యంత నమ్మకమైన పెట్టుబడి ఎంపికగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సీనియర్ సిటిజన్ల కోసం 5 సంవత్సరాల ఎఫ్‌డీలపై 8.05 శాతం వరకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ రేట్లు 60 ఏళ్లు పైబడిన వారికి వర్తిస్తాయి. సూర్యోదయ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు 5 సంవత్సరాల ఎఫ్‌డీలపై 8.05 శాతం అత్యధిక వడ్డీని అందిస్తోంది. జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ 7.77 శాతం, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ 7.70 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. అదేవిధంగా ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ కూడా 7.50 శాతం వరకు రాబడిని అందిస్తున్నాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం చిన్న ఫైనాన్స్ బ్యాంకులు తమ రిటైల్ డిపాజిట్లను పెంచుకోవడానికి పెద్ద బ్యాంకులతో పోలిస్తే ఎక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. స్టేబుల్‌ మనీ సహ వ్యవస్థాపకుడు సురభ్‌ జైన్‌ మాట్లాడుతూ.. ఉత్కర్ష్, సూర్యోదయ, శివాలిక్ వంటి బ్యాంకులు చాలా కాలంగా తమ ఎఫ్‌డీ రేట్లలో స్థిరత్వాన్ని కొనసాగిస్తున్నాయని, దీంతో పెట్టుబడిదారుల నమ్మకం పెరిగిందని తెలిపారు. అయితే కేవలం అధిక వడ్డీ రేట్లను చూసి పెట్టుబడి పెట్టకూడదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో డబ్బు పెట్టే ముందు భద్రత, బ్యాంకు స్థిరత్వం వంటి అంశాలను కూడా పరిశీలించాలని సూచిస్తున్నారు.

అన్ని బ్యాంక్ ఎఫ్‌డీలకు డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) ద్వారా రూ.5 లక్షల వరకు బీమా రక్షణ లభిస్తుంది. అందువల్ల ఒకే బ్యాంకులో రూ.5 లక్షల లోపు మాత్రమే ఎఫ్‌డీ పెట్టుబడులు ఉంచడం సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా అనుకోని పరిస్థితి వచ్చినా డబ్బు రక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎఫ్‌డీలపై టిడిఎస్ నిబంధనలను కూడా తెలుసుకోవడం ముఖ్యం. వార్షిక వడ్డీ ఆదాయం రూ.1 లక్ష దాటితే బ్యాంకులు టిడిఎస్ కట్ చేస్తాయి. అయితే, 2025-26 ఆర్థిక సంవత్సరానికి కొత్త పన్ను విధానం ప్రకారం రూ.12 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్లు ఫారం 15హెచ్ సమర్పించడం ద్వారా టిడిఎస్ మినహాయింపు పొందవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us