Deep fake videos: ఆ వీడియోలపై జాగ్రత్త తప్పనిసరి.. స్పష్టం చేసిన ఆర్‌బీఐ

|

Nov 20, 2024 | 4:24 PM

పెరుగుతున్న సాంకేతికతతో మన జీవన ప్రమాణాలు ఎంతో మెరుగుపడుతున్నాయి. నేడు అన్నిరంగాల్లో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇంటి దగ్గర కూర్చునే అనేక పనులు చేసుకునే వెసులుబాటు కలిగింది. అలాగే సామాన్యుడి వరకూ కూడా సాంకేతిక వ్యవస్థ చేరింది. అయితే ఇదే సమయంలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి.

Deep fake videos: ఆ వీడియోలపై జాగ్రత్త తప్పనిసరి.. స్పష్టం చేసిన ఆర్‌బీఐ
Follow us on

టెక్నాలజీని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సైబర్ నేరాలు ఇటీవల అనేక వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కొత్తగా రిజర్వ్ బ్యాంకు ఉన్నతాధికారుల పేరుతో నకిలీ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ తో సహా ఉన్నతాధికారుల ఆర్థిక సలహాలు, వివిధ పెట్టుబడి మార్గాలు పేరుతో ఇటీవల నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. డీప్ ఫేక్ వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగించి వీటిని రూపొందించారు. ఆర్బీఐ ఉన్నతాధికారుల పేరు మీద వచ్చిన ఈ వీడియోలను చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో ఆర్బీఐ అప్రమత్తమైంది. తాము ఎలాంటి పెట్టుబడి పథకాలను ఆమోదించమని స్పష్టం చేసింది. అవి నకిలీ వీడియోలను, వాటితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

కొందరు సైబర్ నేరగాళ్లు డీప్ ఫేక్ టెక్నాలజీతో నకిలీ వీడియోలను రూపొందిస్తున్నారు. ఆర్ బీఐ గవర్నర్, ఇతర ఉన్నతాధికారులు వివిధ ఆర్థిక పథకాలను ప్రోత్సహిస్తున్నట్టు వారి చిత్రాలతో డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి వీడియోలు తయారు చేశారు. దీనికోసం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ను ఉపయోగించారు. వీటిని నకిలీ వీడియోలని మనం గుర్తించలేము. ఒరిజినల్ వీడియోల మాదిరిగానే కనిపించేలా చాలా జాగ్రత్తగా వీటిని రూపొందిస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కొన్ని పెట్టుబడి పథకాలను ప్రారంభించిందని, మరి కొన్నింటికి మద్దతు తెలుపుతుందంటూ ఇటీవల నకిలీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటి బారిన ప్రజలు మోస పోయే ప్రమాదం ఉండడంతో ఆర్బీఐ వెంటనే స్పందించింది. తాము ఎలాంటి పథకాలను ప్రారంభించడం లేదని, వేటికీ మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది.

డీప్ ఫేక్ వీడియోల వల్ల అనేక నష్టాలు కలుగుతాయి. వాటిని నమ్మి వివిధ పథకాలలో పెట్టుబడులు పెడితే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అలాగే మీ వ్యక్తిగత సమాచారంతో పాటు డబ్బులను కూడా సైబర్ నేరగాళ్ల దోచుకునే అవకాశం ఉంది. వీటి వల్ల మోసపోయిన వారు భవిష్యత్తులో నిజమైన పథకాలలో కూడా పెట్టుబడి పెట్టేందుకు వెనుకడుగు వేస్తారు. ఆన్ లైన్ స్కాముల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారిక సంస్థలు ఆమోదించిన పెట్టుబడి పథకం అంటూ వచ్చినప్పడు క్రాస్ చెక్ చేసుకోవాలి. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్లను సందర్శించాలి. లేదా వారి హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయాలి. సోషల్ మీడియలో వచ్చే ప్రతి అంశాన్ని, వార్తను నమ్మకూడదు. డబ్బు కావాలంటూ అడిగే వీడియోలు, మెసేజ్ లు, పథకాలను నమ్మవద్దు. మీకు నకిలీ వీడియోలు కనిపిస్తే ఆ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారానికి నివేదించి అధికారులకు తెలియజేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి