
డిజిటల్ బ్యాంకింగ్ యుగంలో మన చేతిలో మొబైల్ ఉంటే చాలు.. బ్యాంకింగ్ పనులన్నీ చిటికెలో పూర్తవుతాయి. అయితే ఈ సౌలభ్యంతో పాటు కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంక్ యాప్‌లు, వెబ్‌సైట్ల రూపకల్పనలో వినియోగదారులను తప్పుదారి పట్టించే డార్క్ ప్యాటర్న్స్ పట్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి మోసపూరిత విధానాలకు స్వస్తి పలకాలని బ్యాంకులకు గడువు విధించింది.
బ్యాంకింగ్ సేవలను వాడుకునేటప్పుడు మనకు తెలియకుండానే అదనపు ఛార్జీలు పడటం, అవసరం లేని ఇన్సూరెన్స్ లేదా సర్వీసులను పదేపదే పాప్ అప్‌ల ద్వారా చూపించడం, క్లిష్టమైన నిబంధనలతో గందరగోళానికి గురిచేయడం వంటి వాటిని డార్క్ ప్యాటర్న్స్ అంటారు. ఇవి వినియోగదారులను తప్పుదోవ పట్టించి, డబ్బులు ఖర్చు పెట్టేలా చేస్తాయి.
వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడానికి ఆర్‌బీఐ రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్ అమెండ్మెంట్ డైరెక్షన్ 2026 ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ బ్యాంకింగ్‌ను మరింత సురక్షితంగా, బాధ్యతాయుతంగా మార్చనుంది. వినియోగదారులు కూడా బ్యాంకింగ్ యాప్‌లను ఉపయోగించేటప్పుడు నిబంధనలను జాగ్రత్తగా చదవడం మంచిది.