Axis Bank: యాక్సిస్ బ్యాంక్ జూన్ 16 నుంచి అమలులోకి వచ్చేలా రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై నిర్దిష్ట కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా రెండోసారి రెపో రేటును పెంచిన తర్వాత.. SBI, HDFC, ICICI బ్యాంక్ వంటి పలు ప్రముఖ బ్యాంకులు FD రేట్లను పెంచాయి. తాజా.. ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో రెపో రేట్లను మరో 50 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి సెంట్రల్ బ్యాంక్ గత నెలలో పాలసీ రేటును 90 పాయింట్ల మేర పెంచింది.
యాక్సిస్ బ్యాంక్ తన వెబ్‌సైట్ లో అందించిన వివరాల ప్రకారం.. ఏడాది, 5 నుంచి 10 సంవత్సరాల కంటే తక్కువ కాల పరిమితి ఉండే డిపాజిట్లపై వడ్డీ రేట్లు మారవని తెలుస్తోంది. అయితే.. 1 సంవత్సరం, 11 రోజుల నుంచి ఒక సంవత్సరం 25 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్ల రేట్లు అంతకుముందు ఉన్న 5.25% నుంచి 5.75%కి అంటే 50 బేసిస్ పాయింట్లు పెంచింది. 1 సంవత్సరం 25 రోజుల నుంచి 15 నెలల కాలవ్యవధి ఉన్న FDలపై కొత్త రేటు 5.60%నికి పెంచింది. సీనియర్ సిటిజన్లు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇతర డిపాజిటర్ల కంటే 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా వడ్డీని పొందవచ్చు. సీనియర్ సిటిజన్ FDల డిపాజిట్ రేట్లు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధికి 2.50% నుంచి 6.50% వరకు ఉన్నాయి.
సాధారణ పొదుపు ఖాతాతో పోలిస్తే అధిక వడ్డీ రేటు, తక్కువ రిస్క్ కారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లకు దేశంలో చాలా ప్రజాదరణ ఉంది. వడ్డీ రేటు మొత్తం మెచ్యూరిటీ వ్యవధికి నిర్ణయించబడుతుంది. ఇది సాధారణంగా అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడుతుంది. వడ్డీ రేట్లు బ్యాంకు నుంచి బ్యాంకుకు భిన్నంగా ఉంటాయి. సంపాదించిన వడ్డీని క్యుములేటివ్, త్రైమాసికం, నెలవారీ ప్రామాణికంగా లెక్కించవచ్చు.