డిజిటల్ పేమెంట్స్ సదుపాయం రాకముందు.. డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి ప్రజలందరూ బ్యాంకుల ముందు భారీ ఎత్తున క్యూ కట్టేవారు. డబ్బులు విత్ డ్రా చేయడానికైనా, డిపాజిట్ చేయడానికైనా లైన్లలో గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో అయితే సర్వర్లు పని చేయక.. ఉత్త చేతులతో వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చేది. అయితే, ఆ తరువాత ఏటీఎం మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. డబ్బులు డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఏటీఎం నుంచే విత్ డ్రా చేసుకునే అవకాశం లభించింది. దాంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లయ్యింది. అయితే, సౌకర్యాలు పెరిగినా కొద్ది మోసగాళ్లు కొత్త కొత్త మార్గాలలో ప్రజలను దోచుకుంటున్నారు. ఏటీఎం అందుబాటులోకి వచ్చిందని మురిసినా.. ఆ ఏటీఎంను అడ్డుపెట్టుకుని దోచుకునే కేటుగాళ్ల బెడద కూడా ఎక్కువైందనే ఆందోళన కూడా పెరిగింది. ఏటీఎం లో నగదు విత్‌డ్రా చేసుకునే ముందు ప్రజలు చేసే కొన్ని పొరపాట్లు.. ఆ కేటుగాళ్లకు వరంగా మారుతున్నాయి. ఆ తప్పులను ఆసరాగా చేసుకుని, మోసగాళ్లు బాధితుల అకౌంట్ల నుంచి డబ్బులు లాగేస్తున్నారు. మరి ఇలాంటి మోసాల బారిన పకుండా ఉండాలంటే ఏటీఎం సెంటర్లలో ఈ నాలుగు తప్పులు అస్సలు చేయకూడదు. ఆ నాలుగు తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది డబ్బులు తీసుకోవడానికి ఏటీఎంకు వెళ్లి అక్కడి పరిస్థితులు ఏమాత్రం పట్టించుకోకుండా పని చేసుకుని వస్తారు. అయితే మీరు వెళ్లిన ఏటీఎం మిషన్‌లో క్లోనింగ్ పరికరం ఇన్‌స్టాల్ చేయబడిందో లేదో తెలుసుకోవడానికి మీరు కార్డ్‌ను ఇన్‌సర్ట్ చేసే ప్లేస్‌ను చెక్ చేయాలి. ఏదైనా తేడాగా అనిపిస్తే.. ఆ ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోకుండా.. పోలీసులకు, బ్యాంకు అధికారులకు సమాచారం అందించాలి.
చాలా మంది తమ ఏటీఎం పిన్‌ను నమోదు చేసేటప్పుడు కీప్యాడ్‌ను చేతితో కవర్ చేయరు. మీరు ఏటీఎం మెషీన్‌లో మీ పిన్‌ను ఎంటర్ చేసినప్పుడల్లా, మరొక చేత్తో కీప్యాడ్‌ను కవర్ చేయాలి. దీంతో మీ పిన్ నంబర్‌ను ఎవరూ తెలుసుకోలేరు.
ప్రజలు చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే.. అపరిచితుల నుండి సహాయం తీసుకోవడం. ఇలా అస్సలు చేయొద్దు. ఏటీఎం నుంచి డబ్బును ఎలా విత్‌డ్రా చేయాలో మీకు తెలియకపోతే, మీ సోదరుడు, తండ్రి, బిడ్డ లేదా మీకు తెలిసిన వారిని తీసుకెళ్లాలి. అదీ కుదరకపోతే ప్రతి ఏటీఎం వద్ద గార్డు ఉంటారు. ఆ గార్డు సహాయం తీసుకోవచ్చు. కానీ అపరిచితుడి సహాయం తీసుకుని చిక్కుల్లో పడొద్దు.
చాలా మంది ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునే సమయంలో హడావుడిగా ఉంటారు. డబ్బులు చేతికి వచ్చిన వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోతారు. ఇలా ఎప్పుడూ చేయొద్దు. మీరు ATM నుండి డబ్బు తీసుకున్నప్పుడల్లా, లావాదేవీ పూర్తయ్యే వరకు వేచి ఉండాలి. ఆ తర్వాతనే మీరు అక్కడి నుండి వెళ్లాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..