
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. చాలా ఆర్థిక పరమైన అంశాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదే క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరల విషయంలో కూడా కీలకమైన అప్ డేట్ వచ్చింది. అదేంటంటే ఇప్పటి వరకూ ఎలక్ట్రిక్ వాహనాలపై ఉన్న ఫేమ్ 2 సబ్సిడీ స్కీమ్ 2024 మార్చి 31తో ముగిసిపోయింది. కొత్తగా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్(ఈఎంపీఎస్) ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ స్కీమ్ లో కొన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు సబ్సిడీలు తగ్గిపోయాయి. ఫలితంగా వాటి ధరలను వాహనాల తయారీదారులు పెంచేశారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. అయినప్పటికీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఏమాత్రం తగ్గలేదు. వాస్తవానికి ఈ వాహనాలు నిర్వహణ ఖర్చును అమాంతం తగ్గించేస్తాయి. ఇంధనంపై పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది. దీంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ శాతం మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో అసలు ఏ కంపెనీ ఎంత మేర ధరను పెంచింది? ప్రస్తుతం మన దేశంలోని టాప్ మోడళ్ల ధరలు ఎలా ఉన్నాయి? తెలుసుకుందాం రండి..
ఫేమ్ II స్కీమ్ 2024, మార్చి 31న ముగియడంతో, భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (ఈఎంపీఎస్) దృష్ట్యా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరల పెంపు జరిగింది. ఈ ఈఎంపీఎస్ పథకం ఈవీ స్వీకరణను ప్రోత్సహించడమే లక్ష్యంగా అమల్లోకి వచ్చింది. ఈ కొత్త స్కీమ్ కింద సబ్సిడీలు ఎలక్ట్రిక్ స్కూటర్‌కి రూ. 10,000కి పరిమితం చేశారు. ఇది ఫేమ్ II పథకం కింద అందించిన సబ్సిడీ కంటే చాలా తక్కువ. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులు ఏథర్, బజాజ్, టీవీఎస్, హీరో విడా ధరల పెంపును ప్రకటించాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ ఓఈఎం ఓలా ఎలక్ట్రిక్ తన ఈ-స్కూటర్‌ల ప్రస్తుత ధరలను 15 ఏప్రిల్ 2024 వరకు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.
టీవీఎస్ ఐక్యూబ్, హీరో విడా, ఏథర్ ఎనర్జీ, టీవీఎస్, బజాజ్ ఆటో కంపెనీల్లో మోడల్‌ను బట్టి ధరలను రూ.3,000 నుంచి రూ.16,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..