Aadhaar Card: కొత్త ఆధార్ కార్డులు వస్తున్నాయి.. అవి కనిపించకుండ UIDAI సరికొత్త నిర్ణయం..
మనం ఎక్కడ పడితే అక్కడ ఇస్తున్న ఆధార్ జిరాక్స్ కాపీలే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు అస్త్రాలుగా మారుతున్నాయి. మీ అడ్రస్, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్‌తో మీ ప్రమేయం లేకుండానే మోసాలు జరిగిపోతున్నాయి. అందుకే వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు UIDAI ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.

ఆధార్ కార్డు.. మన దేశంలో ప్రభుత్వ పథకం నుంచి వైద్యం దాక ప్రతీదానికి కావాల్సిన గుర్తింపు కార్డు. అయితే ఆధార్ అక్రమాలు సైతం అదేస్థాయిలో ఉంటాయి. అందుకే ఆధార్ కార్డులో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటుంది. తాజాగా మరో కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఆధార్ కార్డు ఫోటోకాపీల ద్వారా జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఇకపై జారీ చేసే ఫిజికల్ కార్డులపై సున్నితమైన సమాచారాన్ని తగ్గించాలని నిర్ణయించింది. నివేదికల ప్రకారం.. భవిష్యత్తులో మనకు అందే ఆధార్ కార్డుపై కేవలం మీ ఫొటో, ఒక QR కోడ్ మాత్రమే కనిపిస్తాయి. మీ పుట్టిన తేదీ, పూర్తి చిరునామా, తండ్రి పేరు వంటి వ్యక్తిగత వివరాలు కార్డుపై ఉండవు. ప్రస్తుతం మనం సిమ్ కార్డులు తీసుకోవడానికైనా, హోటల్ రూమ్ బుకింగ్ కైనా ఆధార్ జిరాక్స్ ఇస్తున్నాం. అందులో ఉన్న పూర్తి వివరాలను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అందుకే భౌతిక కార్డును కేవలం ఒక ఫోటో ఐడిగా మాత్రమే మార్చాలని UIDAI ప్రతిపాదించింది.
QR కోడ్‌తోనే అన్నీ..
మరి వివరాలు ఎలా వెరిఫై చేస్తారు? అనే సందేహం మీకు రావచ్చు. కార్డుపై ఉండే QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా బ్యాంకులు లేదా ప్రభుత్వ సంస్థలు మీ పూర్తి వివరాలను ధృవీకరించుకోవచ్చు. దీనివల్ల మీ ప్రైవసీకి భద్రత ఉంటుంది.
ఆధార్ యాప్‌లో మరిన్ని ఫీచర్లు..
UIDAI ఇటీవల విడుదల చేసిన పూర్తిస్థాయి యాప్ ద్వారా కార్డుదారులు అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
బయోమెట్రిక్ లాక్: ఒక్క క్లిక్‌తో మీ వేలిముద్రలను లాక్ లేదా అన్‌లాక్ చేయవచ్చు.
వివరాల అప్‌డేట్: అడ్రస్, మొబైల్ నంబర్ మార్పు వంటి వాటి కోసం ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. యాప్ ద్వారానే పూర్తి చేయవచ్చు.
డిజిటల్ ఆధార్: యాప్‌లో లాగిన్ అయితే మీ ఫోటో, క్యూఆర్ కోడ్ కనిపిస్తాయి. మిగిలిన వివరాలు సురక్షితంగా దాచబడి ఉంటాయి.
మోసాలకు అడ్డుకట్ట
UIDAI CEO భువనేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆధార్ ఫోటోకాపీల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి ఈ కొత్త నియమాలను త్వరలోనే అమలు చేయనున్నారు. గతేడాది డిసెంబర్ నుంచే ఈ మార్పులకు సన్నాహాలు జరుగుతున్నాయి.
