
ఆధార్ కార్డు అనేది ప్రతీఒక్కరికి అత్యంత అవసరమైన డాక్యుమెంట్. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి సిమ్ కార్డు పొందే వరకు ప్రతీ అవసరానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది లేకపోతే ఎలాంటి సేవలు పొందలేము. అయితే బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలంటే ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా మారింది. బ్యాంక్ ఓపెన్ చేసేందుకు, అనంతరం కేవైసీ పూర్తి చేసేందుకు ఆధార్ అవసరం పడుతుంది. బ్యాంకులు అకౌంట్ తెరిచేటప్పుడు ఫేస్ వెరిఫికేషన్ అడుగుతాయి. ఇలాంటి సమయంలో ఆధార్ ఫేస్ ఆర్డీ లేదా ఇతర యాప్‌ల ద్వారా మీ ముఖం స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ముఖ ధృవీకరణ కోసం ఎక్కువ సమయం పడుతుంది. వేరే యాప్‌లు డౌన్ లోడ్ చేసుకుని మళ్లీ బ్యాంకింగ్ యాప్‌లోకి వచ్చి ప్రక్రియ పూర్తి చేయాలంటే సమయం ఎక్కువ పడుతుంది.
సమయాన్ని తగ్గించడం, సులభంగా ఫేస్ వెరిఫికేషన్ పూర్తయ్యేలా చేసేందుకు యూఐడీఏఐ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇక నుంచి వేరే యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా బ్యాంకింగ్, ఇన్యూరెన్స్, బ్రోకింగ్ లాంటి యాప్స్‌లోనే ప్రక్రియ సులభంగా పూర్తి చేసేలా కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి మీ ముఖాన్ని ఆధార్‌తో సరిపోల్చడానికి వేరే యాప్‌లకు వెళ్లాల్సిన పని ఉండదు. బ్యాంక్, బీమా కంపెనీలు తమ యాప్‌లోనే ఆధార్ ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేసేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో పాట శాండ్ బాక్స్‌ను కూడా యూఐడీఏఐ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా బ్యాంకులు తమ సొంత సర్వర్లలో ఆధార్ ఫేస్ అథెంటికేషన్‌ను నిర్వహించుకోవచ్చు. దీని వల్ల యూఐడీఏఐ కేంద్రాలపై కూడా ఒత్తిడి తగ్గుతుంది. ఈ కొత్త టెక్నాలజీలో ఏఐ, లైవ్ నెస్ డిటెక్షన్, స్పూఫింగ్ నిరోధించడం, మెషిన్ లెర్నింగ్ వంటి సామర్థ్యాలు ఉన్నాయి. శాండ్ బాక్స్ ద్వారా బయోమెట్రిక్ హార్డ్ వేర్ అవసరం లేకుండా ఫేస్ క్యాప్చర్, లైవ్ నెస్ చెక్, ఎర్రర్ హ్యాడిలింగ్ వంటి దశలను పరీక్షించవచ్చని యూఐడీఏఐ తెలిపింది.
అయితే 2021లో ఫేస్ అథెంటికేషన్ వ్యవస్థ ప్రారంభం అవ్వగా.. ఇప్పటివరకు 500 కోట్లకు లావాదేవీలు ప్రాసెస్ అయ్యాయి. రానున్న రోజుల్లో ఆథార్ ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో దానికి తగ్గట్లు మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నారు. ఇప్పటివరకు యాప్స్‌లో ఆధార్ ముఖ గుర్తింపు ధృవీకరణ పూర్తి చేయాలంటే ఒక యాప్ నుంచి ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. కొన్నిసార్లు యాప్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడటం వల్ల ఆలస్యమవుతోంది. ఇప్పుడు ఆ సమస్య తొలగిపోయి వేగవంతంగా వెరిఫికేషన్ పూర్తి కానుంది.