చెన్నై కేంద్రంగా సర్ మౌంట్ లాజిస్టిక్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ పనిచేస్తుంది. లాజిస్టిక్స్ రంగంలో సరకుల రవాణా, పారదర్శకత, సప్లయి చైన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తుంది. దీనిలో చాాలా మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వారిని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఈ కంపెనీ ఖరీదైన బహుమతులు అందించింది. ఆ సంస్థలో ప్రతిభ చూపుతున్న సుమారు 20 మందిని ముందుగా ఎంపిక చేసింది. వారికి టాటా కార్లు, రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ లు, యాక్టివా స్కూటర్లు బహుమతులుగా అందించింది. సాధారణంగా ప్రతి ఏడాదికీ ఒకసారి వివిధ కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్ లు అందిస్తాయి. సుమారు ఒక నెల జీతాన్ని ఇలా పంపిణీ చేస్తాయి. దాని కోసం కార్మికులు చాాలా ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు.
బోనస్ అందుకున్న తర్వాత ఎంతో సంబర పడతారు. వారికి మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఒక టానిక్ లా పనిచేస్తుంది. అలాగే తమకు సంస్థ అండగా ఉంటుందన్న భరోసాను కల్పిస్తుంది. చైన్నైకి చెందిన కంపెనీ తమ ఉద్యోగులకు కార్లు, బైక్ లు, స్కూటర్లను బహుమతులుగా ఇచ్చి వార్తల్లో నిలిచింది. వాటిని అందుకున్న ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ ప్రతిభను గుర్తించిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అంకిత భావం, సమయస్ఫూర్తి, కష్టపడి పనిచేసే ఉద్యోగులకు మరింత ప్రోత్సహించడానికి ఇలా కార్యక్రమాలు ఉపయోగపడతాయి. వారు మరింత అత్యున్నత లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహిస్తాయి.
సంస్థ ఫౌండర్, ఎండీ డెంజిల్ రాయన్ ఈ విషయంపై మాట్లాడుతూ అన్ని వ్యాపారాల్లోనూ లాజిస్టిక్స్ ను మరింత సరళవంతం చేయడం తమ లక్ష్యమన్నారు. సంప్రదాయ షిప్పింగ్, లాజిస్టిక్ ప్రక్రియలో ఏర్పడే సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలు చూపడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఉద్యోగులకు ఇచ్చే బహుమతులు వారిని ఎంతో ప్రోత్సహిస్తాయన్నారు. తద్వారా మరింత సమర్థవంతంగా పనిచేయడానికి దోహద పడతాయని వివరించారు. ఇలా ఉద్యోగులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం చాలా అవసరమన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి