మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో టీవీఎస్ జుపిటర్ ఒకటి. మన భారతీయ ఆటోమార్కెట్లో టీవీఎస్ జుపిటర్ కు ఫ్యామిలీ వర్గాల నుంచి మంచి డిమాండే ఉంది. ఈ స్కూటర్ ను తొలుత 2013లో మార్కెట్లోకి తీసుకొచ్చారు. హోండా నుంచి అందుబాటులో ఉన్న యాక్టివాకు గట్టి పోటినిచ్చి నిలబడిన ఏకైక స్కూటర్ ఇదేనని మార్కెట్ వర్గాలు సైతం చెబుతుంటాయి. కాగా ఈ జుపిటర్ కొత్త మోడల్ ఇప్పుడు మన దేశంలో లాంచ్ అయ్యింది. 2024 టీవీఎస్ జుపిటర్ 110 పేరుతో దీనిని తీసుకొచ్చారు. దీని ధర రూ. 73,700(ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతుంది.
ఈ కొత్త మోడల్ ప్రధానంగా చెప్పాల్సిందే డిజైన్ గురించే. 2024 టీవీఎస్ జుపిటర్ 110లో డిజైన్ పరంగా చాలా మార్పులు చేశారు. చూడగానే ఆకట్టుకునే విధంగా రూపొందించారు. ముందు వైపు ఎల్ఈడీ లైట్ బార్ టర్న్ ఇండికేటర్లతో కలిపి ఉంటుంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ ను కొత్త కలర్ స్కీమ్లో తీసుకొచ్చారు. స్కూటర్ వెనుకవైపు ఎల్ఈడీ టైల్ ల్యాంప్, టర్న్ ఇండికేటర్లతో వస్తుంది. అలాగే త్వరగా స్క్రాచ్ లు పడకుండా ఉండేందుకు గ్లాస్ బ్లాక్ ప్లాస్టిక్ ను బండికి కవరప్ గా వాడింది. సీటుగా పాతదాని కన్నా కొంచెం పెద్దదిగా ఉంటుందని టీవీఎస్ పేర్కొంది.
2024 టీవీఎస్ జుపిటర్ 113.3సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ తో వ్సతుంది. ఇది 5000 ఆర్పీఎం వద్ద 7.91బీహెచ్పీ గరిష్ట శక్తిని, 9.2ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా ఒక ఎలక్ట్రిక్ అసిస్ట్ ను ఇచ్చారు. దీని ద్వారా 9.8 ఎన్ఎం వరకూ టార్క్ అవుట్ పుట్ ని పెంచుకోవచ్చు. ఇది స్టాండ్ స్టిల్ గా వెళ్తున్నప్పుడు, ఓవర్ టేకింగ్ చేసే సమయంలో ఉపయోగపడుతుంది. ఇది గరిష్టంగా గంటకు 82 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్త జుపిటర్ లో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను పరిచయం చేసింది. సీటుకింద రెండు హెల్మెట్లు పెట్టుకునేంత స్థలం అందిస్తోంది. అక్కడే మొబైల్ కోసం యూఎస్బీ పోర్టు, ఎక్స్ టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్, ఎల్ఈడీ లైటు ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. అత్యవసర స్టాప్ సిగ్నల్ ఉంటుంది. ఆటో కట్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి. వాయిస్ కమాండ్స్ హజార్డ్ ల్యాంప్స్, ఫాలోమీ హెడ్ ల్యాంప్స్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..