ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎంకిసాన్) 17వ విడత కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు . నివేదికల ప్రకారం పీఎం-కిసాన్ పథకానికి సంబంధించి 17వ విడత మే చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. 16వ విడతను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఫిబ్రవరి 28, 2024న మహారాష్ట్రలోని యవత్మాల్‌లో తన పర్యటన సందర్భంగా 9 కోట్ల మందికి పైగా రైతులకు రూ.21,000 కోట్ల విలువైన పీఎం-కిసాన్ పథకం యొక్క 16వ విడతను ప్రధాని విడుదల చేశారు. 15వ విడతను నవంబర్ 15, 2023న మోదీ విడుదల చేశారు. పీఎం-కిసాన్ పథకం కింద అర్హులైన రైతులు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 పొందుతారు. ఇది సంవత్సరానికి రూ. 6,000. ప్రతి సంవత్సరం ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి వంటి మూడు వాయిదాలలో డబ్బు అందిస్తారు. ఈ పెట్టుబడి సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ పథకాన్ని 2019 మధ్యంతర బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. అయితే పీఎం కిసాన్ వాయిదాలను స్వీకరించడానికి రైతులు తమ ఈ-కేవైసీని పూర్తి చేయాలి. పథకానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ ప్రకారం పీఎం-కిసాన్ నమోదిత రైతులకు ఈ-కేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ పీఎం కిసాన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది లేదా బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ కోసం సమీప సీఎస్‌సీ కేంద్రాలను సంప్రదించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..