యాపిల్ రూ.100 కోట్ల పెట్టుబడి.. 1.5 లక్షల భారతీయ ఇళ్లలో వెలుగు!
టెక్ దిగ్గజం ఆపిల్ భారత్‌లో పర్యావరణ, పునరుత్పాదక ఇంధన రంగంలో 100 కోట్లతో భారీ పెట్టుబడిని ప్రకటించింది. దీని ద్వారా 150 మెగావాట్ల కొత్త ఇంధన సామర్థ్యం, ఆరు స్టార్టప్‌లకు మద్దతు లభిస్తుంది. 2030 నాటికి కార్బన్ తటస్థ స్థితికి చేరుకోవడమే లక్ష్యంగా, వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛమైన ఇంధన వినియోగంపై దృష్టి సారించి, దేశంలో హరిత భవిష్యత్తుకు ఆపిల్ దోహదపడుతుంది.

టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఇప్పుడు భారత్‌లో కేవలం ఐఫోన్ తయారీతోనే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, హరిత ఇంధన రంగాల్లో కూడా తన ముద్ర వేయడానికి పెద్ద అడుగులు వేస్తోంది. దేశంలో పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి సంస్థ రూ.100 కోట్ల ప్రారంభ పెట్టుబడిని ప్రకటించడం గమనార్హం. ఈ పెట్టుబడితో పాటు పర్యావరణ రంగంలో పనిచేస్తున్న ఆరు స్టార్టప్‌లకు కూడా మద్దతు అందిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను పునరుత్పాదక ఇంధన సంస్థ క్లీన్‌మ్యాక్స్ భాగస్వామ్యంతో అమలు చేస్తున్నారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా 150 మెగావాట్లకు పైగా కొత్త పునరుత్పాదక ఇంధన సామర్థ్యం అభివృద్ధి కానుంది.
ఈ స్థాయి విద్యుత్ ఉత్పత్తి సుమారు 1.5 లక్షల భారతీయ గృహాల వార్షిక విద్యుత్ అవసరాలను తీర్చగలదని అంచనా. ఇప్పటికే భారతదేశంలోని తన కార్యాలయాలు, రిటైల్ స్టోర్లను 100 శాతం స్వచ్ఛమైన ఇంధనంతో నడిపించేందుకు ఆపిల్ రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టులను అమలు చేస్తోంది. అంతేకాకుండా వ్యర్థాల నిర్వహణ, వలయాకార ఆర్థిక వ్యవస్థ, సుస్థిర జీవనోపాధి రంగాల్లో పనిచేస్తున్న స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం, మార్గదర్శకత్వం అందించేందుకు అక్యూమెన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కంపెనీ పర్యావరణ కార్యక్రమాలపై స్పందించిన ఆపిల్ ప్రతినిధి సారా చాండ్లర్, పర్యావరణ బాధ్యతే సంస్థ ఆవిష్కరణలకు ప్రధాన ప్రేరణ అని పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ భాగస్వామ్యంతో భారతదేశంలో తయారీ విస్తరణను ఆపిల్ వేగవంతం చేస్తోంది. 2030 నాటికి తన మొత్తం కార్యకలాపాలను కార్బన్ తటస్థ స్థితికి తీసుకెళ్లడమే సంస్థ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేందుకు WWF-ఇండియా సహకారంతో రీసైక్లింగ్ వ్యవస్థలను బలోపేతం చేస్తోంది. సాహస్ జీరో వేస్ట్ తో కలిసి గోవాలో విజయవంతంగా అమలు చేసిన వ్యర్థాల నిర్వహణ నమూనాను ఇప్పుడు కోయంబత్తూరు వంటి ప్రాంతాలకు విస్తరిస్తున్నారు.
అలాగే రైతులకు నిల్వ సౌకర్యాలు అందించే సప్తకృషి, ఎలక్ట్రిక్ రిఫ్రిజిరేటెడ్ వాహనాలను అభివృద్ధి చేస్తున్న యులు ఎనర్జీ, మహిళలకు ఈవీ డ్రైవింగ్, వ్యాపార శిక్షణ ఇస్తున్న MoEVing ఫ్లీట్ వంటి సామాజిక సంస్థలకు కూడా ఆపిల్ మద్దతు అందిస్తోంది. ఆపిల్ విడుదల చేసిన తాజా పర్యావరణ పురోగతి నివేదిక ప్రకారం 2015 తర్వాత సంస్థ ఆదాయం 78 శాతం పెరిగినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను 60 శాతానికి పైగా తగ్గించడం విశేషం. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ కలిసి సాధ్యమని ఈ చర్యలు సూచిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
