Economic Survey 2020-21 LIVE Updates : ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేసిన ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచింది ప్రభుత్వం. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. గత పార్లమెంట్ సమావేశాల తరహాలోనే ఈసారి కూడా సభలను నిర్వహిస్తున్నారు. ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్‌సభ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను రెండు భాగాలుగా విభజించింది కేంద్రం. శుక్రవారం మొదలయ్యే సమావేశాలు వచ్చే నెల 15తో ముగుస్తాయి. అనంతరం పార్లమెంట్ మార్చి 8న తిరిగి సమావేశమవుతుంది. కరోనా నేపథ్యంలో పేపర్ లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. అందువల్ల.. సభ ముందుకు బడ్జెట్ప్రతులు, ఆర్థిక సర్వే డాక్యుమెంట్లు వచ్చిన అనంతరం.. వాటిని ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఆర్థిక సర్వే హైలెట్స్ ఈ దిగువున చూడొచ్చు.
ఆర్థిక సర్వే 2021 వివరాలను వెల్లడించే సందర్భంలో భారత ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్ అనేక ఆసక్తికర విషయాలు వల్లెవేశారు. భారత సంస్కృతీ, సాంప్రదాయాలు, మహాభారత ఘట్టాల్ని గుర్తుకు తెచ్చారు. భారతీయ రాజులు కరువుకాటకాలు సంభవించినప్పుడు రాజభవనాలు నిర్మించి ఉపాధి కల్పించే వారని ఆయన ఈ సందర్బంలో పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా వైరస్ వంటి ప్రతికూల సమయంలో ఎక్కువ ఖర్చు పెట్టాలని సూచించిందని తెలిపారు.
కరోనా కష్టకాలంలో పేదలను పేదరికం నుంచి బయట పడేయడానికి కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా ఆర్థిక వృద్ధిపై దృష్టి పెట్టాల్సిందేనని ఆర్థిక సర్వే సూచించింది. వృద్ధిని అలాగే కొనసాగించాలని, కరోనా వైరస్ నుంచి కోలుకొని ప్రి-కోవిడ్ స్థాయికి మళ్లీ వెళ్లడానికి రెండేళ్లు పట్టొచ్చని సర్వే అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం హెల్త్ కేర్ రంగంపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉందని పేర్కొంది.
భారత్ లో వచ్చే ఆర్థిక సంవత్సరాన జీడీపీ వృద్ధి చైనా కంటే ఎక్కువగా ఉంటుందని ఆర్థిక సర్వేలో అంచనా కట్టారు. ఆర్థికాభివృద్ధి వేగంలో వ్యవసాయం యొక్క పాత్ర ముఖ్యమైనదని కూడా సర్వే అభిప్రాయపడింది. రిటైల్ ద్రవ్యోల్బణం మెరుగుపడటం వలన సరఫరా వైపు ఒత్తిడి తగ్గింది. ఈ కారణంగా ఆహార ద్రవ్యోల్బణం దెబ్బతిందని సర్వే వెల్లడించింది. ఆరోగ్య సంరక్షణ రంగాన్ని త్వరగా రూపుదిద్దడమే ప్రభుత్వ పాత్రని కూడా సర్వే నిర్దేశించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి కూడా అతి ముఖ్యమైనది.ఈ సర్వేలో భారత ఆర్థిక వ్యవస్థకు రోడ్‌మ్యాప్ కూడా ఉంది. అలాగే, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి, చాలా విషయాలపై ప్రత్యేక శ్రద్ధ ఆర్థిక సర్వేలో ఇవ్వబడిందని కృష్ణమూర్తి సుబ్రమణియన్ పేర్కొన్నారు.
భారత ఆర్థిక సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను ఈసారి డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచుతున్నారు. ఎకనమిక్ సర్వే ఆఫ్ ఇండియా అఫీషియల్ యాప్ లో సర్వ సమాచారం అందుబాటులో ఉంచారు. గూగుల్ ప్లే స్టోర్ లో ఈ సదరు యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఆర్థిక సర్వే సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
Official mobile app for #EconomicSurvey of India is now available on Google play store
Download here⬇️https://t.co/vVehcHoBZy pic.twitter.com/kDs7s5WIEN
— PIB India (@PIB_India) January 29, 2021
ప్రీ బడ్జెట్ ఫీవర్ స్టాక్ మార్కెట్లను షేక్ చేసింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రానున్న బడ్జెట్ మధ్య దేశీయ సూచీలు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ట్రేడింగ్ ఆరంభంలో లాభాల బాటపట్టిన సూచీలు ఫిబ్రవరి సిరీస్‌ను ఉత్సాహంతో స్టార్ట్ చేశాయి. ఒక దశలో 400 పాయింట్లకు పైగా ఎగిసి, 5 రోజుల వరుస నష్టాలకు చెక్ చెప్పాయి. అయితే, ఆ తర్వాత తీవ్ర ఒడిదుడుకులకు లోనై 600 పాయింట్లకు పైగా కుప్పకూలింది. రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరకు సెన్సెక్స్ 589 పాయింట్లు పతనమై 46 వేల 300 స్థాయి దిగువకు చేరింది. నిఫ్టీ 183 పాయింట్ల నష్టంతో 13634 వద్ద ముగిసింది.
భారత దేశవ్యాప్తంగా పెట్టుబడులను పెంచే చర్యలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ఆర్థిక సర్వే తెలిపింది. తక్కువ వడ్డీ రేటు కారణంగా వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయని పేర్కొంది. కరోనా అంటువ్యాధిని నియంత్రించడానికి కరోనా వ్యాక్సినేషన్ సాధ్యపడుతుందని, మరింత ఆర్థిక పునరుద్ధరణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని సర్వేలో పేర్కొన్నారు. అంతేకాదు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థలో పూర్తి పునరుద్ధరణ ఉంటుందని, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మందగించిన ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటోందని, వి-షేప్డ్ రికవరీ భారతదేశంలో కనిపించిందని సర్వేలో వెల్లడించారు.
2020 డిసెంబర్ 5 నుండి 23వ తేదీవరకూ భారతప్రభుత్వం 41, 061 స్టార్టప్‌లను గుర్తించిందని ఆర్థిక సర్వేలో వెల్లడించారు. దేశవ్యాప్తంగా 39వేలకి పైగా స్టార్టప్‌ల ద్వారా 4,70,000 మందికి ఉపాధి కలిగిందని పేర్కొంది. 1 డిసెంబర్ 2020 నాటికి, సెబీలో నమోదు చేసుకున్న 60 ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులకు (ఎఎఫ్‌ఐ) రూ. 4,326.95 కోట్లు అందించడానికి సిడ్బి కట్టుబడి ఉందని పేర్కొంది. మొత్తం రూ. 10వేల కోట్ల ఫండ్ ఉన్న స్టార్టప్‌ల కోసం, ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా విడుదల చేయాలని ఆర్థిక సర్వేలో చూచించారు.
మనదేశ ఆర్థిక విధానాలకు మానవీయ విలువలే స్ఫూర్తి అని చీఫ్ ఎకనమిక్ అడ్వయిజర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ చెప్పారు. ప్రమాదంలో ఉన్న ప్రాణాన్ని కాపాడటం ధర్మానికి మూలాధారమని మహాభారతం చెబుతోందని, ఈ మానవీయ సిద్దాంతం నుంచే కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో భారతదేశ ఆర్థిక విధానాలు రూపొందుతున్నాయని ఆయన వెల్లడించారు. పరిపక్వత, దూరదృష్టితో మనదేశ ఆర్థిక విధానాలను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. దీర్ఘ కాలిక లబ్ధిని పొందడం కోసం స్వల్ప కాలిక నష్టాన్ని భారత దేశం స్వీకరించిందని కరోనా లాక్ డౌన్ గురించి ఆయన వ్యాఖ్యానించారు. ఇంగ్లీష్ లెటర్ ‘వి’ ఆకృతిలోని రికవరీ మన దేశాన్ని పరిణతిగల విధానాల రూపకల్పనలో ప్రత్యేక స్థానంలో నిలబెడుతుందని ఆయన చెప్పారు.
కొవిడ్ మహమ్మారి సమయంలో దేశంలో కేవలం వ్యవసాయ రంగం మాత్రమే సానుకూల వృద్ధిని నమోదు చేసిందని ఆర్థిక సర్వే వెల్లడించింది. లాక్‌డౌన్‌లో తయారీ, నిర్మాణ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. అందుబాటు ధరల్లోని ఇల్లు అమ్మకాలు జులై నుంచి పుంజుకున్నాయని సర్వే పేర్కొంది. రియల్ ఎస్టేట్ రంగం కోలుకుందనడానికి ఇదే నిదర్శనమని అభిప్రాయపడింది.
భారతదేశ సార్వభౌమ క్రెడిట్ రేటింగ్ విషయంలో విదేశీ రేటింగ్ సంస్థల వ్యవహారంపై ఆర్థిక సర్వే అసంతృప్తి వ్యక్తం చేసింది. రేటింగ్ ఏజెన్సీలు పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని సర్వే అభిప్రాయపడింది. ఆర్థిక వ్యవస్థలకు అనుగుణంగా మదింపు చేసే విధానం ఉండాలని సూచించింది.
మోదీ సర్కారు తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఆర్థిక సర్వే సమర్థించింది. ఈ చట్టాల వల్ల దీర్ఘకాలంలో చిన్న, మధ్య తరహా రైతుల ఆదాయం పెరుగుతుందని పేర్కొంది. తమ పంటల్ని ఎక్కడైనా విక్రయించుకునే స్వేచ్ఛ వల్ల రైతులు తమ ఉత్పత్తులకు అధిక ధర పొందుతారని వెల్లడించింది. మార్కెట్ యార్డుల్లో గంటలకొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితులు ఇకపై ఉండబోవని సర్వే పేర్కొంది.
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం యావత్తూ స్థంభించిపోయినా భారత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుందని ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ చెప్పారు. లాక్ డౌన్ వేళ, భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా.. తగినన్ని ఫారెక్స్ నిల్వలు, తయారీ రంగం నుంచి సానుకూల సంకేతాలు, దృఢమైన కరెంట్ ఖాతా వంటివి వి-షేప్ రికవరీకి దోహదం చేశాయని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది.
దేశవ్యాప్తంగా కరోనా కట‍్టడి, బాధితుల మరణాల నివారణలోనూ తెలుగు రాష్ట్రాలకు ఫుల్ మార్కులు వేశారు ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్. కరోనా మహమ్మారిని నివారించడంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాలు సమర్ధవంతంగా వ్యవహరించగా, మహారాష్ట్ర కరోనా కేసులు, మరణాల నివారణలో విఫలమైందని పేర్కొన్నారు. అలాగే మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించిన కోవిడ్ యోధులకు ఈ ఏడాది సర్వేను అంకితం చేసినట్టు తెలిపారు.
2021-2022 వచ్చే ఆర్థిక సంవత్సరంలో రియల్ జీడీపీ వృద్ధి 11 శాతంగా ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసిందని ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్ చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆర్థిక సర్వే 2020-21ని పార్లమెంటులో ప్రవేశపెట్టిన అనంతరం సీఈఏ ఆర్థిక సర్వేని మీడియా సమావేశంలో వివరించారు. ఈ సందర్బంగా కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ యాప్‌లో ఆర్థికసర్వే వివరాలను పొందుపర్చినట్టు వెల్లడించారు.
కరోనా వైరస్ ను కట్టడిచేయడమేకాకుండా, ప్రజల ప్రాణాలను కాపాడ్డంలోనూ కేంద్ర ప్రభుత్వం చురుగ్గా, సమర‍్ధవంతంగా వ్యవహరించిందని ప్రధాన ఆర్థిక సలహాదారు( సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్ చెప్పారు. కోవిడ్-19 కట్టడికిగాను విధించిన లాక్‌డౌన్ తదితర ఆంక్షల కారణంగా దేశంలో 3.7 మిలియన్ల కరోనా కేసులను నివారించగలిగామని తెలిపారు. మార్చి 31 తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి 7.7 శాతంగా ఉండొచ్చని పేర్కొన్నారు.
కొవిడ్ 19 మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ పాఠశాల విద్య దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రారంభమైందని సిఇఎ కృష్ణమూర్తి సుబ్రమణియన్ వెల్లడించారు. గ్రామీణ భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉన్న పాఠశాల విద్యార్థుల శాతం 2018 లో 36.5% ఉంటే, అది 2020 లో 61.8% కి పెరిగిందని చెప్పారు.
ఆర్థిక సర్వే 2021 : 2019 & 2020 సంవత్సరాలను కార్మిక సంస్కరణల చరిత్రలో మైలురాళ్లుగా అభివర్ణించారు సిఇఎ కృష్ణమూర్తి సుబ్రమణియన్. 29 కేంద్ర కార్మిక చట్టాలు నాలుగు లేబర్ కోడ్‌లుగా హేతుబద్దీకరణ, సరళీకృతం చేయబడ్డాయని ఆయన వెల్లడించారు. అఖిల భారత స్థాయిలో నిరుద్యోగిత రేట్లు 2017-18లో 6.1 శాతం నుండి 2018-19లో 5.8% కి తగ్గాయని ఆయన పేర్కొన్నారు.
పార్లమెంట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బిఎసి) సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. పార్లమెంట్ హౌస్ అనెక్స్ ఎక్స్‌టెన్షన్‌లో ఈ మీటింగ్ జరుగుతోంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చిస్తున్నారు. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో బిఎసి సమావేశాలు జరుగుతున్నాయి. సభలో చర్చించాల్సిన అంశాలపై ఈ మీటింగ్ లో సభ్యులు తమ తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు.
బడ్జెజ్ సమావేశాల్లో భాగంగా 2020-21 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తూ ప్రతిపక్ష పార్టీలు నేటి సమావేశానికి హాజరుకాలేదు. ఆర్థిక సర్వే సమర్పణ అనంతరం లోక్‌సభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభ మూడు గంటలకు ప్రారంభం కానుంది.
Finance Minister @nsitharaman tables the #EconomicSurvey 2020-’21 in Parliament#EconomicSurvey2021 pic.twitter.com/8VrucWnQeH
— All India Radio News (@airnewsalerts) January 29, 2021
ఆర్ధిక సర్వేను తొలిసారి 1950లో ప్రవేశ పెట్టారు అప్పటి నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. ఆర్థిక సర్వే రెండు వాల్యూమ్స్‌లో ఉంటుంది. తొలి వాల్యూమ్‌లో ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు ఉంటాయి. రెండో వాల్యూమ్‌లో ఆర్థిక వ్యవస్థకు చెందిన గత ఆర్థిక సంవత్సరపు రివ్యూ ఉంటుంది. ఇంకా ప్రభుత్వ పథకాలు, పాలసీల గురించి వివరంగా ఉంటాయి.
ప్రధాన ఆర్ధిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ నేతృత్వంలోని బృందం ఈ ఆర్ధిక సర్వేను రూపొందించింది. గతేడాది పలు రంగాల ఆర్ధిక స్థితిగతులను ఇందులో వివరించారు. దీంతో పాటు ఆర్ధిక వృద్ధికి చేపట్టాల్సిన సంస్కరణలను పేర్కొన్నారు. ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్ధిక సర్వేపై సుబ్రమణియన్ మీడియాకు వివరించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెడుతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ఆవిష్కరిస్తుంది. అయితే ఈసారి మాత్రం రెండు రోజులు ముందే ఆర్థిక సర్వేను ఆవిష్కరిస్తోంది.
ఎకనమిక్ సర్వే చాలా కీలకమని చెప్పుకోవాలి. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ డాక్యుమెంట్ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనీ సప్లై, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఉపాధి, ఎగుమతులు, దిగుమతులు, ఫారిన్ ఎక్స్చేంజ్.. ఇలా పలు వాటికి సంబంధించిన ట్రెండ్స్ ఎలా ఉన్నాయో అర్దిక సర్వే తెలియజేస్తుంది.
ప్రధాని మోదీ సర్కార్ కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. బడ్జెట్ కన్నా ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక్క రోజు ముందు ఆర్థిక సర్వేను ఆవిష్కరిస్తారు. అయితే ఈసారి మాత్రం రెండు రోజులు ముందుగానే ఎకనమిక్ సర్వే 2021ను ఆవిష్కరించనున్నారు.