ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న కేంద్రంలోని బీజేపీ సరికొత్త బడ్జెట్‌తో ప్రజల ముందుకొస్తోంది. వరుసగా ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిద్ధమవుతున్నారు. 2.0లో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న చివరి బడ్జెట్ ఇది. వచ్చే ఏడాది ఏప్రిల్- మేలో ఎన్నికలు జరగుతాయి కాబట్టి ఆ ఏడాది సాధారణంగా ఓట్ ఆన్ అకౌంట్ రూపంలో బడ్జెట్ ఉంటుంది. పేదలు, మధ్యతరగతికి ఏమైనా అందించేందుకు ఉన్నది ఈ అవకాశమే. వాస్తవానికి GST ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్‌పై ఆసక్తి తగ్గింది. ఒకప్పుడు బడ్జెట్ అంటే ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయోనని యావత్ దేశం ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు.
వస్తువులు, సేవలన్నీ GST పరిధిలోనే ఉన్నాయి. అంటే పరోక్ష పన్నులైనటువంటి సెంట్రల్ ఎక్సైడ్ డ్యూటీ, స్టేట్ వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్ వంటివన్నీ ఇప్పుడు GST కింద ఉన్నాయి. అయితే ఆదాయపన్ను, వెల్త్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ వంటి డైరెక్ట్ ట్యాక్సులు వంటివి బడ్జెట్‌లో భాగంగానే ఉన్నాయి.
అంతర్జాతీయం చోటుచేసుకుంటున్న మాంద్యం, కొవిడ్ -19 మళ్లీ భయపెడుతుందని వినినపిస్తున్న కథనాల మధ్య పెరుగుతున్న ధరలతో తల్లడిల్లుతున్న సగటు మనిషి ఈ బడ్జెట్ ఎంతో కొంత ఉపశమనం లభించాలని ఎదురుచూస్తున్నాడు. మరో వైపు అమెరికా, యూరోప్‌లో పెరుగుతున్న లేఆఫ్స్‌ను ఆర్థిక వ్యవస్థ చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. ఈ క్రమంలో ఆదాయ పన్ను మినహాయింపు పెంచాలన్నది సగటు మనిషి కోరుకుంటున్న మాట.
గృహరుణాలను మరింత ఆకర్షణీయంగా మార్చాల్సిన అవసరముందనే మాట అటు నిపుణులతో పాటు సామాన్య మానవుడి నుంచి కూడా వినిపిస్తోంది. అదే సమయంలో గృహాల ధరలు తగ్గించేందుకు సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రిపై పన్నులను హేతుబద్ధం చేయాల్సిన అవసరముందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
మరో వైపు ఈ బడ్జెట్ సంస్కరణలు, ఆర్థిక స్థిరీకరణపై ప్రధానంగా దృష్టి సారించవచ్చనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికలకు ముందు కీలక రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రజాకర్షక పథకాలు తీసుకురావచ్చనే అభిప్రాయాలు అటు రాజకీయ వర్గాల నుంచే కాకుండా ఆర్థిక నిపుణలు నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి.
వచ్చేది ఎన్నికల సంవత్సరం కాబట్టి అనేక రంగాలు ఈ బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నాయి. దాదాపు ప్రతీ రంగమూ ప్రభుత్వం నుంచి ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశిస్తోంది. మరి నిర్మలమ్మ గారు చేస్తారో చూడాలి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం