Budget 2022: కరోనాతో మారుతున్న అంచనాలు.. వచ్చే బడ్జెట్‌లో పేదల సబ్సిడీలు, సంక్షేమానికి ఎసరు!

| Edited By: KVD Varma

Jan 17, 2022 | 11:23 PM

కరోనా మహమ్మారి విజృంభణతో మునుపెన్నడు లేని సంక్షోభాన్ని భారత దేశం ఎదుర్కొంటోంది. గత రెండేళ్లుగా మూడు విడతల్లో జనానికి చుక్కులు చూపిస్తోంది. మొదటి, రెండో వేవ్‌ల్లో సాధారణ జన జీవనం అస్తవ్యస్తమైంది. ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది.

Budget 2022: కరోనాతో మారుతున్న అంచనాలు.. వచ్చే బడ్జెట్‌లో పేదల సబ్సిడీలు, సంక్షేమానికి ఎసరు!
Budget
Follow us on

Indian Budget 2022: కరోనా మహమ్మారి విజృంభణతో మునుపెన్నడు లేని సంక్షోభాన్ని భారత దేశం ఎదుర్కొంటోంది. గత రెండేళ్లుగా మూడు విడతల్లో జనానికి చుక్కులు చూపిస్తోంది. మొదటి, రెండో వేవ్‌ల్లో సాధారణ జన జీవనం అస్తవ్యస్తమైంది. ఆర్థిక వ్యవస్థ (Economy)స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో 2022- 23 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌(Budget 2022)ను ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్(Nirmala Sitharaman) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. కరోనా సృష్టిస్తున్న విధ్వంసంతో అస్తవ్యస్తమైన వ్యవస్థలను గాడిన పెట్టడంతో పాటు, భవిష్యత్తులో విశ్వ యవనికపై భారత పతాకాన్ని రెపరెపలాడించే ఆర్థిక ప్రణాళికపై కేంద్ర ప్రభుత్వం(Union Government) కసరత్తు చేస్తోంది. స్వల్పకాలం ఊరట కల్పించే పథకాల ప్రకటన కన్నా దీర్ఘకాలంలో దేశాభివృద్ధికి బాటలు వేసే వ్యవస్థీకృత కార్యక్రమాలపై ఈ బడ్జెట్‌లో దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం 2022-23లో మొత్తం సబ్సిడీని తగ్గించనున్నట్లు సమాచారం. ప్రభుత్వం రానున్న బడ్జెట్‌లో ఆహార, ఎరువుల సబ్సిడీలను వరుసగా రూ.2.60 లక్షల కోట్లు, రూ.90,000 కోట్లుగా ఉంచాలని భావిస్తున్నారు. ఇది ఆర్థిక సంవత్సరం 2022 కోసం సవరించిన అంచనాల కంటే తక్కువ. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం సబ్సిడీ బిల్లు దాదాపు రూ. 5.35 నుండి 5.45 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నివేదిక ప్రకారం, 2023 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటు స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 6.5 శాతంగా ఉంటుందని ఒక అధికారి తెలిపారు. గత బడ్జెట్‌లో ప్రకటించిన జిడిపిలో 6.8 శాతానికి ఇది భిన్నం. మన ఆర్థిక లక్ష్యాల మేరకు ఆహారం, ఎరువులపై సబ్సిడీ ఉంటుందని ఓ అధికారి తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆహార సబ్సిడీ బిల్లు సవరించిన అంచనాలలో సుమారు రూ. 3.90 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. బడ్జెట్‌లో చేసిన రూ. 2.43 లక్షల కోట్లు. కానీ 2021 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 4.22 లక్షల కోట్ల కంటే తక్కువ. కాగా, ఆర్థిక సంవత్సరం 2022లో ఆహార సబ్సిడీ బడ్జెట్‌లో కేటాయించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. కరోనా మహమ్మారి కారణంగా మార్చి 2022 వరకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) కింద ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగిస్తోంది కేంద్రం. 2022 ఆర్థిక సంవత్సరానికి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మొత్తం వ్యయం రూ. 1.47 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ప్రభుత్వం బడ్జెట్‌లో 2022 ఆర్థిక సంవత్సరానికి ఎరువుల సబ్సిడీకి రూ.79,530 కోట్లు కేటాయించింది.

అయితే, పెరుగుతున్న ఎరువుల ధరలు, సరఫరా పరిమితుల కారణంగా ప్రభుత్వం అదనపు నిధులను రెట్టింపు చేయవలసి ఉంటుంది. ఇది దాదాపు రెట్టింపు సబ్సిడీ బిల్లు రూ.1.41 లక్షల కోట్లకు చేరుకుంటుంది. నివేదిక ప్రకారం, 2023 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల కంటే ఎరువుల సబ్సిడీకి కేటాయింపు తక్కువగా ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో ఈ ఏడాది మొత్తం రూ.1.47 లక్షల కోట్ల వ్యయం కాగా, ఇప్పటికే రూ.90,000 కోట్లు ఖర్చు చేసినట్లు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ తెలిపారు. అంటే ఆహార సబ్సిడీకి అదనపు కేటాయింపు రూ.60,000 కోట్లు.

ఇదిలావుంటే, దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎలా జరుగుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. కరోనా దృష్ట్యా ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి.

మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంది. మొదటి విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జనవరి 31న ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Read Also… Punjab Elections: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలులో స్పల్ప మార్పు.. ఫిబ్రవరి 20న పోలింగ్‌!