జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యంగా విమర్శలకు పదును పెడుతోంది వైసీపీ. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ని టార్గెట్‌గా చేసుకుని పదునైన ఆరోపణలు చేశారు. రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీ నివేదికను పూర్తిగా తొక్కిపెట్టిన టిడిపి అధినేతను ప్రశ్నించాల్సిన పవన్ కల్యాణ్.. అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. పశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన జనసేనాని.. అనైతిక రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
విమర్శలకు మరింత పదును పెట్టిన ఇక్బాల్.. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం ఆధారంగా కామెంట్లు చేశారు. వ్యక్తిగత జీవితంలో అనుసరించిన అనైతిక బంధాలను.. పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంలోను కొనసాగిస్తున్నారని అన్నారు ఇక్బాల్. ఒకరితో వైవాహిక సంబంధం కొనసాగిస్తూనే ఇంకొకరితో సంబంధం పెట్టుకున్నారని జనసేనానిపై విమర్శలు గుప్పించారాయన. చెగువేరా పేరు చెబుతూ.. కేసనోవాను అనుసరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
గత చంద్రబాబు ప్రభుత్వ అనైతిక కార్యక్రమాలను ఏనాడు ప్రశ్నించని పవన్ కల్యాణ్.. టిడిపి ప్రభుత్వ అవినీతిపై కూడా పెదవి విప్పలేదన్నారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో రాజకీయాలొద్దనన్న ఇక్బాల్.. ఇంగ్లీషుని ప్రోత్సహిస్తే క్రిస్టియానిటీని ప్రోత్సహించినట్లు కాదని తెలుసుకోవాలని అన్నారు. మతాల ఆచారాలను గౌరవించే విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదని కుండబద్దలు కొట్టారు ఇక్బాల్.