నెలరోజుల క్రితం టిడిపిని వీడనున్నట్లు ప్రకటించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంగళవారం మధ్యాహ్నం వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఏపీ మంత్రి కొడాలి నానితో కలిసి జగన్ నివాసానికి వెళ్ళిన వంశీ.. ముఖ్యమంత్రితో దాదాపు అరగంట పాటు సమావేశయ్యారు.
మరి కొన్ని రోజుల్లో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వంశీ ముఖ్యమంంత్రిని కల్వడం, సుదీర్ఘంగా సమాలోచనలు జరపడం చర్చనీయాంశమైంది. అక్టోబర్ 26న తాను టిడిపిని వీడనున్నట్లు వంశీ ప్రకటించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్‌తో ఒక దఫా భేటీ అయ్యారు. కానీ ఇప్పుడా అప్పుడా అని ఎదురు చూస్తున్నా కూడా వంశీ.. వైసీపీలో చేరిక పర్వం ఒక కొలిక్కి రాలేదు. పలు మార్లు రేపు, మాపు అంటూ తేదీలు లీక్ అయినా వంశీ వైసీపీలో చేరలేదు.
తాజాగా కొడాలి నానితో కలిసి జగన్‌తో భేటీ అయిన వంశీ.. ఈ వారంలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలా లేక టిడిపికి రాజీనామా చేసి, న్యూట్రల్‌గా వున్నట్లుంటూ.. వైసీపీతో కలిసి పనిచేయాలా అనే దానిపై జగన్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఇదిలా వుండగా.. ఇటీవల వైసీపీలో చేరిన దేవినేని అవినాష్ కూడా మంగళవారం జగన్‌తో భేటీ అయ్యారు. అవినాష్‌ను కూడా కొడాలి నాని స్వయంగా ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్ళారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్‌ఛార్జీ బాధ్యతలను తనకు అప్పగించినందుకు అవినాష్ వైసీపీ అధినేతకు కృతఙతలు తెలిపేందుకే వీరు వెళ్ళినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో చురుగ్గా పని చేయాలని అవినాష్‌కు జగన్ సూచించినట్లు సమాచారం.