యూపీలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించి.. మరో ఆరు చోట్ల లీడింగ్ లో ఉంది. అటు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ఒక స్థానంలో గెలిచి.. మరో చోట ఆధిక్యంలో కొనసాగుతోంది. గంగోయ్, లక్నో కంటోన్మెంట్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. జైద్ పూర్ సీటును సమాజ్ వాదీ పార్టీ గెలుచుకుంది. బీజేపీ మిత్రపక్షమైన
అప్నా దళ్.. సోనీలాల్ స్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు మాయావతి ఆధ్వర్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. నిజానికి ఈ ఉప ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ గానీ, మాయావతి గానీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బై పోల్స్ ని తేలిగ్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. అఖిలేష్, మాయావతి నేతృత్వాల్లోని రెండు పార్టీలూ ఎలాంటి పొత్తు పెట్టుకోకుండా ఈ ఉప ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేశాయి. అయితే సీఎం, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించి ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఈ ఎన్నికలను కూడా ఆయన ప్రతిష్టాత్మకంగా భావించారు.