
Thirteen cities in corona danger zone across the country: 13 నగరాలపైనే కేంద్రం నజర్ పెట్టింది. అందులో హైదరాబాద్ కూడా వుంది. బుధవారం వరకు కేవలం 11 నగరాలే దేశంలో కరోనా విపరీతంగా ప్రబలుతున్న నగరాలు భావిస్తున్న తరుణంలో ఈ నగరాల జాబితాలోకి హైదరాబాద్ నగరం కూడా చేరింది. ఒకవైపు లాక్ డౌన్ నాలుగో విడత ముగుస్తున్న తరుణంలో అయిదో విడతపై కేంద్రం దృష్టి సారించింది.
కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న 13 నగరాల మున్సిపల్ కమిషనర్లతో కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై సహా పలు నగరాల కమిషనర్లతో కేంద్ర కేబినెట్ సెక్రెటరీ నేరుగా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఆ 13 నగరాల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబయి, దేశ రాజధాని ఢిల్లీ సహా చెన్నై, అహ్మదాబాద్, థానే, పూణె, హైదరాబాద్, కోల్‌కతా, ఇండోర్, జైపూర్, జోథ్‌పూర్, చెంగల్పట్టు, తిరువల్లూరు ఉన్నాయి. ఈ నగరాల్లో కరోనా కేసుల నియంత్రణకు అక్కడి అధికారులు చేపట్టిన చర్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కరోనా కేసుల వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై సమీక్ష జరిపారు. కరోనా కేసుల మ్యాపింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్, కరోనా రోగులు నివసిస్తున్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
కేసుల తీవ్రతను బట్టి కాలనీలు, మునిసిపల్ వార్డులు, పోలీస్ స్టేషన్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని కేంద్ర కేబినెట్ సెక్రెటరీ సూచించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను భౌగోళికంగా, సాంకేతికంగా గుర్తించాలని ఆదేశించారు. మరో రెండు రోజుల్లో అయిదో విడత లాక్ డౌన్ అమలు ప్రారంభమయ్యే లోగా ఈ తంతును పూర్తి చేయాలని ఆయన మునిసిపల్ కమిషనర్లను కోరారు.