ఏపీలో సంచలనంగా మారిన ఐటీ రైడ్స్.. మెల్లిగా రాజకీయ రంగులను పులుముకొంటోంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ ఐటీ సోదాల్లో.. 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరి 6 నుంచి నిర్వహించిన సోదాల్లో కీలక సమాచారం సేకరించామని ఐటీ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖ, ఢిల్లీ, పూణె సహా దేశంలోని 40 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని అందులో పేర్కొన్నారు. మూడు ప్రముఖ ఇన్‌ఫ్రా కంపెనీలకు సంబంధించి 2 వేల కోట్ల అక్రమాలు బయటపడ్డాయని ఐటీ శాఖ స్పష్టం చేసింది.
అయితే ఈ ఐటీ దాడులకు, టీడీపీకి ముడిపెట్టడంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలొ మండిపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఐటీ దాడులకు, టీడీపీకి ముడిపెట్టడం వైసీపీ కక్ష సాధింపేనన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై బురద జల్లేందుకే ఈ దాడులను అస్త్రంగా చేసుకున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్న ఆయన.. జగన్ అక్రమాస్తులపై సీబీఐ వేసిన కౌంటర్ పిటిషన్‌పై.. వైసీపీ నేతలు ఎందుకు నోరు తెరవరని ప్రశ్నించారు. చంద్రబాబుపై 26కు పైగా విచారణలు జరిపించినా.. ఒక్కటి కూడా రుజువు చేయలేకపోయారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా వైసీపీ నేతలు అటువంటి తప్పుడు ఆరోపణలనే చేస్తున్నారన్నారు.