రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చింది ఐఆర్‌సీటీసీ. ఇకపై రైళ్లలో టీ, కాఫీ, ఫుడ్ ధరలను పెంచేశారు. ఈ విషయాన్ని ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ వెల్లడించింది. కేంద్రం ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఓ సర్క్యూలర్ కూడా జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై రాజధాని, శాతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్‌లలో టీ, టిఫిన్, భోజనం రేట్లను భారీగా పెంచేసింది.
నవంబర్ 14న విడుదలైన ఈ సర్క్యూలర్‌లో రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ప్రామాణిక భోజనం ధరలను పెంచినట్లు పేర్కొంది. ఈ పెరిగిన ధరలు 15 రోజుల్లో అమల్లోకి వస్తాయని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. అంతేకాదు ఆయా రైళ్లలో ఇకపై ప్రాంతీయ భోజనాలు కూడా అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. రైళ్లలో టీ, టిఫిన్, భోజనం రేట్లు పెరగడంతో టికెట్ ధరలు పెరగనున్నాయి. టీ, టిఫిన్, స్నాక్స్, భోజనం ధరలను కలుపుకొనే ఈ రైళ్లలో టికెట్ ధర ఉంటుందన్న విషయం తెలిసిందే.
సవరించిన ధరల తర్వాత రాజధాని, దురంతో, శాతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లలో.. టీ ధర.. రూ .10 నుండి రూ .15 కు పెరగనుంది. ఇక అదే స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏసీ బోగీల్లో.. ఒక కప్పు టీ ధర రూ .20 ఉండనుంది. ఇక భోజనం ధరల విషయానికొస్తే దాదాపు యాభై శాతం పెరిగాయి. గతంలో లంచ్/డిన్నర్ రూ.80 ఉండగా.. పెరిగిన ధరలతో ఇప్పుడు రూ.120 అయ్యింది. ఇక ఈ రైళ్లలో ఫస్ట్ క్లాస్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ఒక టీ కప్పు ధర రూ.35 కాగా.. బ్రేక్‌ఫాస్ట్ రూ. 140 అయ్యింది. ఇక లంచ్/డిన్నర్ రూ.245 అయ్యింది.