ఏక్తా కపూర్ సినిమాకొచ్చిన కష్టం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. కంగనా లీడ్ రోల్‌లో ఆమె చేసిన జడ్జిమెంటల్ హే క్యా.. ఇప్పటికే గాలిలో దీపంలాగే మిణుకుమిణుకుమంటోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ జూలై 26, మరో వారం కూడా గ్యాప్ లేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తయింది. అయినా సినిమా ఊసు మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. దీనంతటికీ కారణం ఈ మూవీలో లీడ్ రోల్ పోషించిన కంగనా మొండితనమే.
రెండు వారాల క్రితం బాలీవుడ్‌ను షేక్ చేసిన కంగనా వర్సెస్ మీడియా ఎపిసోడ్ ఇంకా చల్లారలేదు. కంగనా నోటి దురుసుతనంతో ఆగ్రహంతో ఊగిపోయారు ముంబై ఫిలిం నగర్ జర్నలిస్టులు. వీరంతా ఒక్కతాటిపైకి వచ్చి ఆమె అప్ కమింగ్ మూవీ మీద పడ్డారు. దీంతో జడ్జిమెంటల్ హే క్యా సినిమా ప్రమోషన్‌కి ఫుల్‌స్టాప్ పడిపోయింది.
ముంబై జర్నలిస్టులు ఒక మెట్టు కిందికి దిగి కంగనా సారీ చెబితే అంతా సర్దుకుంటుందన్నారు. అయినా వారి మాటను అస్సలు పట్టించుకున్న పాపాన పోలేదు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా మంకుపట్టుదలను కొనసాగించింది. అయితే ఈ ఎపిసోడ్‌లో ఓ కంటితుడుపు చర్యగా సంజాయిషీ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో కనీసం సారీ అనే పదమే ఎక్కడా కనిపించలేదు. పైగా జర్నలిస్టులకు ఎథిక్స్ అనేవే లేకుండా పోయాయని .. నా వార్తలు వేసుకుని బతికే మీరా నన్ను ప్రశ్నించేది అంటూ రివర్స్ ఎటాక్ చేసింది. దీంతో కంగనాతో మీడియా వార్ పీక్ స్టేజ్‌కి చేరింది.
ప్రస్తుతం మూవీ నిర్మాతలకు కంగనా పెద్ద తలనొప్పిగా తయారైందట. ఆమె వల్లే తమ సినిమాకి దెబ్బ పడుతుందనే బెంగపెట్టుకున్నారట ప్రొడ్యూసర్స్. ఓ వైపు రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ.. కంగనా మనసు ఏ మాత్రం కరగకపోయే సరికి నెత్తీనోరు బాదకుంటోందట నిర్మాత ఏక్తా కపూర్.