సామాజిక దూరానికి చెల్లు.. వైపీపీ ఎమ్మెల్యేపై కేసు

|

Apr 11, 2020 | 1:11 PM

APలో అధికార వైసీపీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక దూరాన్ని విస్మరించారన్నది ఆరోపణ. పోలీసుల వైఖరితో చిర్రెత్తుకొచ్చిన సదరు వైసీపీ ఎమ్మెల్యే ఏకంగా పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.

సామాజిక దూరానికి చెల్లు.. వైపీపీ ఎమ్మెల్యేపై కేసు
Follow us on

ఒకవైపు విజృంభిస్తున్న కరోనా వైరస్.. మరోవైపు లాక్ డౌన్ నిబంధనలు అటు పోలీసులకు, ఇటు పొలిటిషియన్లకు తమ బాధ్యతల నిర్వహణ కత్తిమీద సాములా మారింది. సామాజిక దూరాన్ని పాటించమంటే పోలీసులపై పొలిటిషియన్లకు కోపం వస్తోంది… అలాగని సామాజిక దూరం నిబంధనను గాలికొదిలేస్తే.. పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి షంటింగ్ ప్రారంభం అవుతోంది. ఇలాంటి తరుణంలో నెల్లూరు జిల్లాలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇదే సంఘటన పోలీస్ స్టేషన్ దగ్గర హైడ్రామాకు తెరలేపింది.

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలో శుక్రవారం జరిగిన కురాగాయల పంపిణీలో సామాజిక దూరం పాటించక పోవడంపై వివాదం రాజుకుంది. 144 సెక్షన్ ఆంక్షలను, సామాజిక దూరం నిబంధనలను పట్టించుకోకపోవడంతో అధికార వైసీపీకి చెందిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డపై పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ప్రసన్నకుమార్ రెడ్డి తన అనుచర వర్గంతో కలిసి పోలీస్ స్టేషన్‌కు శనివారం ఉదయం తరలివచ్చారు. తమపై కేసులెందుకు పెట్టారో చెప్పాలంటూ స్టేషన్‌ వరండాలో బైఠాయించారు.

144 సెక్షన్ ఆంక్షల ఉల్లంఘన, సామాజిక దూరం నిబంధనను విస్మరించడంతో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సహా మరో ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసిన విషయాన్ని బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు వివరించారు. సామాజిక దూరం పాటించకుండా పెద్ద సంఖ్యలో ప్రజలకు కూరగాయలు పంపిణీ చేసారన్నది పోలీసుల ప్రధాన అభియోగం. అక్రమ కేసులు కొట్టేసే వరకు కదిలేది లేదంటూ పీఎస్ ముందు ఎమ్మెల్యే బైఠాయించడంతో పోలీసులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. కేసులు ఎత్తివేయక పోతే రాజీనామాకైనా సిద్ధం అంటున్న ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని కన్విన్స్ చేసేందుకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగినట్లు సమాచారం.