
దేశంలో లాక్ డౌన్ సందర్భంగా ప్రజలు చూపిన పరిణతి, చిత్తశుద్ది కనీవినీ ఎరుగనివని ప్రధాని మోదీ ప్రశంసించారు. బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి వీడియో ద్వారా చేసిన ప్రసంగంలో ఆయన.. కరోనాపై జరిపే పోరాటంలో మనం అలసిపోరాదని, ఈ పోరులో విజయం మనదే కావాలన్న దృఢదీక్ష, సంకల్పం ఉంటే చాలునని అన్నారు. ఇదే మన లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ రాకాసిపై పోరాటానికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా ప్రజలంతా ఆదివారం రాత్రి 9 గంటల 9 నిముషాలకు తమ ఇళ్ల బాల్కనీలు, వరండాల్లో దీపాలు, కొవ్వొత్తులను వెలిగించాలన్న తన పిలుపునకు అఖండ స్పందన లభించిన నేపథ్యంలో.. ఇది మన సమష్టి బలాన్ని సూచించిందని అన్నారు. బీజేపీ కార్యకర్తలు ఐదు సూత్రాల అజెండాను పాటించాలని, దేశంలో ఏ పేదవాడూ ఆకలికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత మీదేనని మోదీ కోరారు. పార్టీ అధ్యక్షుడు జెడ్డా సూచించిన మార్గరదర్శక సూత్రాలను అనుసరించాలన్నారు. కరోనాపై జరిపే పోరు యుధ్ధంకన్నా తక్కువైనదేమీ కాదని ఆయన పేర్కొన్నారు. పీఎం కేర్స్ ఫండ్ కు విరాళాలు అందజేయాలని, ఇతరులను కూడా ఇందుకు ప్రోత్సహించాలని ప్రధాని సూచించారు.