AP government decided to go with local bodies elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. పెంచిన రిజర్వేషన్లను హైకోర్టు తిరస్కరించడంతో 50శాతానికి లోబడి రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళేందుకు జగన్ ప్రభత్వం సిద్దమవుతున్నట్లు సమాచారం. తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారం మరో మూడు, నాలుగు రోజుల్లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగే పరిస్థితి కనిపిస్తోంది. బుధవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
మూడు నెలలుగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడా.. అప్పుడా అన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. బలహీన వర్గాలతోపాటు వివిధ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లను పెంచుతూ జారీ చేసిన నోటిఫికేషన్ కోర్టుకు చేరడంతో ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది. తాజాగా రిజర్వేషన్లు 50శాతానికి మించ వద్దంటూ అమరావతి హైకోర్టు తేల్చి చెప్పడంతో.. ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పాత పద్దతిలోని రిజర్వేషన్ల విధానంతోనే ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తోంది.
రిజర్వేషన్లను 50 శాతానికి తగ్గించి ఎన్నికలకు వెళ్లేందుకు కసరత్తు ప్రారంభమైనట్లు సమాచారం. అధికారులు రిజర్వేషన్ల ఖరారులో తలమునకలైన నేపథ్యంలో బుధవారం జరిగే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత వీలైనంత త్వరగా రిజర్వేషన్‌లపై గెజిట్ విడుదల చేసే అవకాశం వుందని తెలుస్తోంది. ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని సమాచారం.
అయితే.. ప్రభుత్వం మరోవైపు బడ్జెట్ సమావేశాలకు సిద్దమవుతోంది. మార్చి 31లోగా అప్రాప్రియేషన్ బిల్లును ఆమోదింపజేసుకుంటేనే.. ఆర్థిక శాఖ నిధులను విడుదల చేసే పరిస్థితి వుండడంతో … ఈసారికి మూడు నెలల కాలానికి తాత్కాలిక బడ్జెట్ (ఓట్ ఆన్ అకౌంట్ తరహాలో) ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి మూడో లేదా నాలుగో వారంలో నాలుగైదు రోజుల పాటు శాసనసభను సమావేశపరిచి.. తాత్కాలిక బడ్జెట్‌ను ఆమోదింపచేసుకుని, ఆ తర్వాత జూన్‌లో పూర్తి స్థాయి బడ్జెట్‌కు వెళ్ళాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.