KTR great news to Telangana people: దీపావళి పర్వదినాన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు పెద్ద శుభవార్త వినిపించింది. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కే.తారక రామారావు స్వయంగా ఈ శుభవార్తను వెల్లడించారు. రాష్ట్రంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 50 శాతం ఆస్తిపన్ను రాయితీని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీనిని రాష్ట్రవాసులందరికీ దీపావళి కానుకగా ఆయన అభివర్ణించారు.
హైదరాబాద్‌కు సంబంధించిన కీలక అంశాలపై తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ దృష్టి సారించారు. ఈమేరకు సచివాలయంలో సీఎస్ సోమేశ్ కుమార్ సహా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మంత్రులు తలసాని, మహమూద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక ప్రకటించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఓ వైపు కరోనా ప్రభావం.. మరోవైపు భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం అయ్యాయని.. అందుకే ఆస్తిపన్నులో మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 15వేల రూపాయల వరకు ఆస్తి పన్ను కట్టే వారికి 50 శాతం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో 10వేల వరకు ఆస్తి పన్ను కట్టే వారికి కూడా 50 శాతం రాయితీ ఇస్తామన్నారు. ఈ కేటగిరీలకు చెందిన వారు ఇదివరకే ఆస్తి పన్ను చెల్లిస్తే చెల్లించిన మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదిలీ చేసి.. వచ్చే సంవత్సరం సగం పన్ను చెల్లిస్తే చాలని కేటీఆర్ తెలిపారు.
దీని ద్వారా రాష్ట్రంలోని 31.40లక్షల కుటుంబాలకు రూ.326.48 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని మంత్రి కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు వరదసాయం కింద 4,75,871 కుటుంబాలకు రూ.475 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. వరద సాయం అందని వారు మీ-సేవాలో పేర్లు, ఇంటి, ఆధార్ నంబర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సాయం అందిస్తారని వివరించారు. అవసరమైతే మరో రూ.100 కోట్లు సాయం అందించేందుకు కూడా ప్రభుత్వం వెనుకాడబోదని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఎన్నడూ లేని స్థాయిలో కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారిని ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం యధాశక్తి ప్రయత్నించిందని ఆయనన్నారు. దసరా ముందు రోజు నాలుగున్నర లక్షల మందికి వరద సాయం 10 వేల రూపాయలు పంపిణీ చేశామని చెప్పారు. ఇప్పటికీ వరద సాయం అందని వారు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలా దరఖాస్తు చేసుకున్న వారికి అధికారుల తనిఖీల తర్వాత పదివేల ఆర్థిక సాయాన్ని బ్యాంకుల్లో వేస్తామని తెలిపారు.
ALSO READ: పారిశుధ్య కార్మికులకు బంపర్ ఆఫర్.. దీపావళి నాడు..