పాకిస్థాన్ తన వక్రబుద్దిని మరోసారి ప్రదర్శిచింది. 73 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు యావత్ భారతం ముస్తాబైన తరుణంలో.. దేశంలో అలజడి సృష్టించేందుకు.. ఉగ్రవాదుల్ని ఉసిగొల్పుతోంది. ఓ వైపు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పుడుతోంది. యూరీ సెక్టార్ వద్ద ఉగ్రవాదుల్ని దేశంలోకి చోరబడించేందుకు యత్నించింది. పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతూ.. భారత సైన్యం దృష్టి మరల్చే యత్నం చేసింది. అయితే అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం.. కాల్పులకు బదులిస్తూ.. చొరబాట్లను అడ్డుకుంది. ఉగ్రవాదులను పంపి కాశ్మీర్‌లో భారీ విధ్వంసం సృష్టించేందుకు పాక్ ప్లాన్ వేసినట్లు ఇప్పటికే నిఘా వర్గాలు తేల్చిచెప్పాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ వద్ద ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చారని.. ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాల నుంచి కాశ్మీర్ వైపు ఉగ్రవాదుల తరలించేందుకు ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆర్టికల్ 370 రద్దు, జమ్ము-కాశ్మీర్ లడఖ్ విభజన నేపథ్యంలో పాక్ కుట్రలకు పూనుకుంటోంది.