ఢిల్లీలోని చాంద్ బాగ్ ప్రాంతంలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ మృత దేహాన్ని బుధవారం ఉదయం కనుగొన్నారు. హింసాకాండతో అట్టుడుకుతున్న ఈ ప్రాంతంలో ఆయన డెడ్ బాడీ కనిపించడం సంచలనమైంది. అతడిని అంకిత్ శర్మ గా గుర్తించారు .ఓ కాలువ నుంచి ఆయన మృత దేహాన్ని బయటకు తీశారు. స్థానికుడైన ఈయన మంగళవారం సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఓ గుంపు చాంద్ బాగ్ బ్రిడ్జిపై కొట్టి చంపారని, ఆయన మృత దేహాన్ని డ్రెయిన్ లో పారవేశారని తెలిసింది. అంకిత్ శర్మ తండ్రి రవీందర్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. ఆప్ మద్దతుదారులే తన కుమారుడిపై దాడి చేసి హతమార్చారని ఆరోపించారు. అంకిత్ పై ఎటాక్ అనంతరం ఆయనపై కాల్పులు కూడా జరిపారని ఆయన అన్నారు.
అటు-ఈ అల్లర్లపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రంగా స్పందించారు. హోమ్ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పరిస్థితి చాలా దారుణంగా ఉందని, వెంటనే పారా మిలిటరీ బలగాలను రంగంలోకి దింపాలని ఆమె కోరారు. ఓ బీజేపీ నేత ద్వేష పూరిత ప్రసంగాలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయన్నారు. .ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమయ్యారని ఆమె ఆరోపించారు. అటు-ప్రియాంక గాంధీ.. ఇదంతా ఓ కుట్ర ప్రకారమే జరుగుతోందని, సీఏఏను వ్యతిరేకిస్తున్నవారిని టార్గెట్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.