విశాఖలోని మిలీనియం టవర్స్‌కు జగన్ ప్రభుత్వం నిధులు కేటాయించడంపై అమరావతి హైకోర్టులో మంగళవారం రగడ చెలరేగింది. రాజధాని తరలింపు కోసమే మిలీనియం టవర్స్‌కు నిధులు కేటాయించారని మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించడంతో హైకోర్టు బెంచ్ ప్రభుత్వాన్ని నిలదీసింది. నిధుల రాజధాని కోసమా లేక మిలీనియం టవర్స్ అభివృద్ధి కోసమా అంటూ అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు బెంచ్ ప్రశ్నించింది.
రాజధానిపై దాఖలైన పిటిషన్లను అమరావతి హైకోర్టు మంగళవారం విచారించింది. మిలినియం టవర్స్‌కు నిధులు కేటాయింపుపై అభ్యంతరం వ్యక్తం చేసిన పిటిషన్ తరపు న్యాయవాది.. నిధులు కేటాయించింది కేవలం రాజధాని తరలింపు కోసమేనని ప్రస్తావించారు. మిలినియం టవర్స్ అభివృద్ధికే నిధులు కేటాయిస్తే తప్పు పట్టలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే.. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.
సచివాలయంలో స్థలం కొరత కారణంగా కార్యాలయాలను తరలిస్తున్నామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో నోటిఫై అయిన కార్యాలయాలను తరలిస్తున్నారని పిటిషన్ తరపు న్యాయవాది ఆరోపించారు. నోటిఫై చేసిన కార్యాలయాలను తరలించడం చట్టవిరుద్దమని ఆయన వాదించారు. వెయ్యి చదరపు అడుగుల్లో విజిలెన్స్ కార్యాలయం కొనసాగుతుందని, కర్నూలులో 8 వేల చదరవు అడుగులు స్థలం లభ్యత ఉందని కోర్టుకు అడ్వకేట్ జనరల్ వివరించారు. తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది.