Jagan decision: ఇక అవన్నీ జగనన్న కాలనీలే..

|

Mar 04, 2020 | 5:48 PM

ఉగాది పర్వదినం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఇవ్వబోతున్న ఇళ్ళ పట్టాలతో నిర్మాణమయ్యే కాలనీలకు ముఖ్యమంత్రి సొంతపేరే పెట్టాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. ముఖ్యమంత్రి జగన్ గతంలో ప్రకటించినట్లుగానే...

Jagan decision: ఇక అవన్నీ జగనన్న కాలనీలే..
Follow us on

Jagan cabinet decides on Jagananna colonies: ఉగాది పర్వదినం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఇవ్వబోతున్న ఇళ్ళ పట్టాలతో నిర్మాణమయ్యే కాలనీలకు ముఖ్యమంత్రి సొంతపేరే పెట్టాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. ముఖ్యమంత్రి జగన్ గతంలో ప్రకటించినట్లుగానే ఉగాది పర్వదినం మార్చి 25న 25 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 26 వేల 976 ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు.. 16 వేల 164 ఎకరాల ప్రైవేటు భూముల్లో మొత్తం 25 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయబోతున్నట్లు కేబినెట్ భేటీ తర్వాత మంత్రి పేర్ని నాని వెల్లడించారు. పేదలకు ఇచ్చే ఈ ఇళ్ళ పట్టాలలో నిర్మాణమయ్యే కాలనీలకు వైఎస్సార్ జగనన్న కాలనీలుగా నామకరణం చేయాలని కేబినెట్ తీర్మానించిందని నాని వివరించారు.

ఇళ్ల పట్టాలను ప్రభుత్వం రిజిస్టర్ చేసి మరీ లబ్ది దారులకు ఇస్తుందని, వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి ఇళ్ళ నిర్మాణాలకు రుణం పొందవచ్చని నాని వెల్లడించారు. రుణాలు పొందే ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్రంలోని తహసీల్దారులను జాయింట్ రిజిస్ట్రార్లుగా ప్రభుత్వం గుర్తించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇళ్ళ పట్టాలపై సర్వాధికారాలు లబ్ధిదారునికి వుంటాయని, అయిదేళ్ళ తర్వాత వారి అవసరం మేరకు అమ్ముకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పిస్తుందని నాని చెబుతున్నారు.

కేబినెట్ మరిన్ని నిర్ణయాలు:

మోదీ ప్రభుత్వం మార్చిన కొత్త విధానం ప్రకారం రాష్ట్రంలో ఎన్పీఆర్‌ను అమలు చేయకూడదని జగన్ కేబినెట్ తీర్మానించింది. గతంలో 2010లో ఉన్న ప్రశ్నలకు పరిమితం అవుతూ ఎన్పీఆర్‌లో మార్పులు కోరుతూ కేబినెట్ తీర్మానం ఆమోదించిందని నాని వివరించారు. ఎన్పీఆర్‌లో మార్పులు చేసే వరకు ఏపీలో ఎన్పీఆర్‌ను అమలు చేయవద్దని మంత్రివర్గం నిర్ణయించిందని ఆయన వివరించారు. విశాఖపట్నం శివారుల్లోని భోగాపురం ఎయిర్ పోర్టు పనుల్లో జీఎమ్మార్ సంస్థకు ఇచ్చిన 2700 ఎకరాల్లోంచి రెండు వందల ఎకరాలను తగ్గిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం భోగాపురం ఎయిర్‌పోర్టును 2500 ఎకరాల్లో నిర్మించాల్సి వుంటుంది.

ఇదీ చదవండి: Jagan warning: అలా అయితే రాజీనామా చేయండి.. మంత్రులకు సీఎం వార్నింగ్