తెలంగాణ మునిసిపల్ ఎన్నికలకు హైదరాబాద్ హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. జనవరి 7న ఉదయం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి వుండగా.. ఆ రోజు సాయంత్రం దాకా నోటిఫికేషన్ విడుదల చేయొద్దని రాష్ట్ర ఎన్నికల అధికారిని ఆదేశించింది హైకోర్టు. దాంతో ఎన్నికల ప్రాసెస్‌కు తాత్కాలికంగా విఘాతం కలిగినట్లయ్యింది. తదుపరి విచారణను జనవరి ఏడుకు వాయిదా వేసింది.
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీపై హైకోర్టులో విచారణ జరిగింది. రిజర్వేషన్లను ఖరారు చేసిన నెల రోజుల తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలంటూ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరపున జంధ్యాల రవిశంకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారించింది. విచారణ పూర్తి కానందున జనవరి 7వ తేదీ సాయంత్రం దాకా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. దాంతో తెలంగాణ మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీలో జాప్యం జరగనుంది.
సోమవారం విచారణ సందర్భంగా హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ప్రతీ సారి ఎన్నికల మ్యాన్యువల్‌ని తప్పుగా ఇవ్వడం ఎన్నికల అధికారులకు ఆలవాటైందని వ్యాఖ్యానించింది. జనవరి 4వ తేదీనాటికి ఓటర్ల జాబితా పూర్తి చేస్తామన్న ఎన్నికల కమిషన్.. డిసెంబర్ 23వ తేదీనే ఎలా పూర్తి చేసిందని కోర్టు ప్రశ్నించింది. ఎన్నికల మ్యాన్యువల్‌ని కోర్టుకు సబ్మిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే మ్యాన్యువల్ అందుబాటులో లేకపోవడంతో ఎలక్షన్ కమిషన్ తరపు న్యాయవాది గడువు కోరారు. దాంతో తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేస్తూ ఆరోజు సాయంత్రం కాదా నోటిఫికేషన్ విడుదల చేయొద్దని ఆదేశాలిచ్చింది.