కరోనా పరీక్షలు ప్రైవేటులో ఎందుకొద్దు? ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

|

May 20, 2020 | 4:36 PM

కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వాల నిర్ణయాన్ని హైదరాబాద్ హైకోర్టు తప్పుపట్టింది. కరోనా వైద్య పరీక్షలు కేవలం గాంధీ ఆసుపత్రిలోనే ఎందుకు నిర్వహించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది..

కరోనా పరీక్షలు ప్రైవేటులో ఎందుకొద్దు? ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
Follow us on

Hyderabad high court question government over covid tests in private hospitals: కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వాల నిర్ణయాన్ని హైదరాబాద్ హైకోర్టు తప్పుపట్టింది. కరోనా వైద్య పరీక్షలు కేవలం గాంధీ ఆసుపత్రిలోనే ఎందుకు నిర్వహించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లోను కరోనా వైద్య పరీక్షలు నిర్వహించుకునే హక్కు ప్రజలకు వుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబుల్లో కరోనా పరీక్షలు, చికిత్సలపై బుధవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. గాంధీ, నిమ్స్ లోనే కరోనా పరీక్షలు చేయించుకోవాలనడం రాజ్యంగ విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రైవేట్ కేంద్రాల్లోనూ డబ్బులు చెల్లించి పరీక్షలు చేయించుకోడం ప్రజల హక్కని హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబులపై నమ్మకం లేకపోతే ఆరోగ్యశ్రీ సేవలకు వాటికి ఎలా అనుమతిచ్చారంటూ ఘాటైన ప్రశ్నను సంధించింది హైకోర్టు.

కరోనా సేవల కోసం ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబులు ఐసీఎంఆర్‌కు దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. ఆస్పత్రులు, ల్యాబుల్లో వైద్య సిబ్బంది, సదుపాయాలను ఐసీఎంఆర్ పరిశీలించి నోటిఫై చేయాలని నిర్దేశించింది. హైకోర్టు తాజాగా వెలువరించిన తీర్పుతో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ముందుకొచ్చిన ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబుల వారు ఇక ఐసీఎంఆర్‌కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలిగింది. ఐసీఎంఆర్ ఆమోదించిన ఆస్పత్రుల్లోనే కరోనా చికిత్సలకు అనుమతించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.