ఓరుగల్లు.. వరద ఫుల్లు

|

Aug 17, 2020 | 12:59 PM

జోరు వానలతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా అతలాకుతలమైంది. ఐదురోజులుగా కురుస్తున్న వానలతో.. ఓరుగల్లు నగరం వర్షపునీటిలో చిక్కుకుపోయింది...

ఓరుగల్లు.. వరద ఫుల్లు
Follow us on

Heavy Rain in Warangal : జోరు వానలతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా అతలాకుతలమైంది. ఐదురోజులుగా కురుస్తున్న వానలతో.. ఓరుగల్లు నగరం వర్షపునీటిలో చిక్కుకుపోయింది. వరంగల్‌ నగర వాసులు మూడు రోజులుగా నీళ్లలోనే నానుతున్నారు. వరంగల్‌, హన్మకొండ, కాజీపేటలోని అనేక కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో… లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

వరంగల్‌, కరీంనగర్‌ ప్రధాన రహదారి అయిన నయీంనగర్‌ రహదారిపై భారీగా వరద ప్రవహిస్తూనే ఉంది. నాలాలు కుచించుకుపోవడంతో పాటు చెరువులు మత్తడి పోస్తుండడంతో.. వర్షాపు నీరు అంతా సమీపంలోని కాలనీలను ముంచెత్తింది. దీంతో చాలా ఇళ్లలోని వరద నీరు వచ్చి చేరగా.. ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వాహనాలు కూడా వర్షంలో మునిగిపోయాయి.

లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను (NDRF)ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పునరావాస కేంద్రాలకు తరలించారు. హైదరాబాద్‌కు చెందిన మూడు (DRF)డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రస్తుతం వరంగల్‌లో సేవలను అందిస్తున్నాయి.

హన్మకొండలోని అమరావతి కాలనీ, నయీంనగర్‌, హంటర్‌రోడ్డులోని సాయిగణేష్‌, కాపువాడ, వరంగల్‌లోని దేశాయిపేట, వీవర్స్‌కాలనీ, ఎన్టీఆర్‌నగర్‌, సమ్మయ్యనగర్‌, సుందరయ్యనగర్‌, లోతుకుంట, శివనగర్‌, ఎస్ఆర్ నగర్‌, మధురా నగర్, లక్ష్మీ గణపతి కాలనీ ప్రాంతాల్లోని ఇళ్లలోని నీళ్లు చేరడంతో ప్రజలు .. వీధిన పడాల్సి వచ్చింది. కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. ఇళ్లలోని నీళ్లు చేరడంతో ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయారు. సర్వం కోల్పోయిన తమకు ఆదుకోవాలని కోరుతున్నారు ప్రజలు.

లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా మంత్రులు.. ప్రజలకు ధైర్యం చెప్పే యత్నం చేశారు. అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు. లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఆహారం, నీళ్లను అందించేలా చూస్తున్నారు. పాత భవనాల్లో ఉన్న వారు స్వచ్చంధంగా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.

వర్షాలు, వరదల కారణంగా విద్యుత్‌కు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నగరంలోని హంటర్‌రోడ్డులో ఉన్న 13 ట్రాన్స్‌ఫార్మర్లు మునిగిపోవడంతో ఆయా ప్రాంతాలకు కరెంటు సరఫరాను నిలిపివేశారు అధికారులు.