Corona virus positive cases across Hyderabad city: కరోనా వైరస్ పాజిటివ్ కేసులు హైదరాబాద్ నగరమంతా విస్తరించినట్టు గణాంకాలు చాటుతున్నాయి. కరోనా ఒకటవ దశ నుంచి రెండో దశకు చేరుకున్న నేపథ్యంలో.. ప్రజలు మరింత అప్రమత్తంగా లేకపోతే.. లాక్ డౌన్ ఆదేశాలను కచ్చితంగా పాటించకపోతే మూడో దశలోకి కరోనా విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ప్రభుత్వం మరింత కఠినంగా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో మనల్ని మనం కాపాడుకునేందుకు మరింత కచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
మార్చ్ 24వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల వరకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కరోనా కేసులు హైదరాబాద్ నగరం నలుమూలలా నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36 కాగా.. హైదరాబాద్ సిటీ అన్ని మూలలకు కరోనా విస్తరించింది. అన్ని ప్రాంతాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాల ప్రకారం.. చందా నగర్, కోకపేట్, బేగంపేట్, పాతబస్తీ, కూకట్ పల్లి, బంజారాహిల్స్, జూబ్లీ హీల్స్, మాధాపూర్, మియాపూర్, సికింద్రాబాద్, మహేంద్రా హిల్స్, మణికొండ, బల్కంపేట్, సైదాబాద్, సోమాజీ గూడ, గచ్చిబౌలి ప్రాంతాలలో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించింది.
ఈ గణాంకాలను పరిశీలిస్తే కరోనా వైరస్ సిటీ అంతగా వ్యాపించినట్టే కనిపిస్తోంది. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులను పరిశీలిస్తే ఎక్కువ గా విదేశాలనుంచి తిరిగి వచ్చిన వారిలోనే పాజిటివ్ వైరస్ కనిపించింది.. కానీ విదేశాల నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న వారికీ కూడా వైరస్ సోకింది. ఇది రెండో దశ ఈ నేపథ్యంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. మూడో దశకు చేరితే వైరస్ వ్యాప్తి నియంత్రణ కష్టసాధ్యం అవుతుంది కాబట్టి… ఈ రెండో దశలోనే సోషల్ గథెరింగ్ కి దూరంగా ఉండడం, లాక్ డౌన్లకు మరింత సహకరించడం అనివార్యంగా కనిపిస్తోంది.