మూడు రోజులు సాగుతున్న ఆర్టీసీ సమ్మె పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆదివారం జరిగిన ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షకు కొనసాగింపుగా ఇవాళ మరోసారి ఆయన సమావేశమయ్యారు. ప్రస్తుతం ప్రగతిభవన్‌లో సమీక్ష కొనసాగుతోంది. ఆర్టీసీ చరిత్రలో నూతన అధ్యాయంప్రారంభిస్తామన్న సీఎం కేసీఆర్ ఈ మేరకు సునీల్ శర్మ కమిటీ ఇవాళ సీఎంకు నివేదిక ఇవ్వనున్నారు. దీన్ని పరిశీలించిన తర్వాత ఆర్టీసీ విషయంలో ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. కమిటీ నివేదికను సమర్పించేందుకు సునీల్ శర్మ.. ప్రగతి భవన్‌కు చేరుకున్నారు.
ఇదిలా ఉంటే ఏళ్ల తరబడి కొనసాగుతున్న విధానాలకు స్వస్తిపలికి నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆర్టీసీని లాభాల వైపునకు నడిపించేలా ప్రణాలికలు రచిస్తోంది. దీనిలో భాగాంగా ఆర్టీసీలో 50 శాతం ప్రైవేటు భాగస్వామ్యం ఉండేలా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఆర్టీసీకి ఉన్న భూములను ఆదాయమార్గాలుగా మలుచుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మెట్రో రైలు ఏవిధంగా లాభాల్లో ఉందో అదే విధానాన్ని ఆర్టీసీలో కూడా కొత్త పద్దతుల్ని ఆచరణలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం.
మరోవైపు ఆర్టీసీ యూనియన్ జేఏసీ నేతలు.. సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. తాము న్యాయబద్దంగానే ముందుకు వెళ్తున్నామని, ఒక్కరినీ కూడా తొలగించే అవకాశం లేదంటున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనంటున్నారు. ఈ ఉదయం గన్‌పార్క్ వద్ద ఆర్టీసీ జేఏసీ నేతలను అరెస్టు చేశారు. అదే విధంగా ఇందిరా పార్కువద్ద ఆందోళన చేపట్టాలనుకున్న ఆర్టీసీ సిబ్బందిని సైతం అక్కడినుంచి తరలించారు. ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో నిరసనను వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం ఇందిరా పార్క్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది.