A cheater cum former Ranji cricketer shocks Telangana minister KTR: తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రి కే.టీ.రామారావుకు ఓ నేరస్థుడు షాకిచ్చాడు. నేరస్థుడిచ్చిన షాక్‌తో కేటీఆర్ నివ్వెరపోయినట్లు సమాచారం. గమ్మత్తేంటంటే సదరు నేరస్థుడు మాజీ రంజీ లెవల్ క్రికటర్ కావడమే.
కేటీఆర్ పీఏ తిరుపతి రెడ్డి పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న ఏపీ మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్‌ను సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నాగరాజు అనే నిరుపేద ప్లేయర్ ఇండియా టీమ్ అండర్ 25 వరల్డ్ కప్ మ్యాచ్, ఐపీఎల్ మ్యాచ్‌లకు సెలెక్ట్ అయ్యడంటూ….తన గురించి తానే చెప్పుకుంటూ మోసాలకు పాల్పడ్డాడీ మాజీ క్రికెటర్.
సీఎం కేసీఆర్, కేటీఆర్‌ల చేతుల మీదుగా కిట్లు అందిస్తామని ప్రైమ్ ఇండియా కంపెనీకి లక్షల్లో టోకరా వేశాడీ ఘటికుడు. దీంతో పాటు ఫిబ్రవరి 9న కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారని, ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణస్వీకారం సభలో స్పాన్సర్ షిప్ ఇప్పిస్తానని మరోసారి మోసానికి యత్నించిన నాగరాజు చివరికి పోలీసులకు చిక్కిపోయాడు.
నాగరాజు పేరును గూగుల్‌లో సెర్చ్ చేసి.. చీటర్ అని తెలుసుకున్న కంపెనీ యాజమాన్యం,తాము మోసపోయామంటూ హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శ్రీకాకుళానికి చెందిన ఏపీ మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ నాగరాజును విశాఖపట్నంలో అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.
ట్రూ కాలర్‌లో తన మొబైల్ నెంబర్‌కు కేటీఆర్ పిఏ అని పేరు పెట్టుకొని పలు కంపనీల వద్ద నుండి భారీగా డబ్బులు వసూలు చేశాడు నాగరాజు. ఇండియన్ క్రికెట్ టీమ్‌కు ఓ యువకుడు ఎంపిక అయ్యాడంటూ… అతనికి స్పాన్సరర్ కావాలని కేటీఆర్ పిఏ పేరుతో ఫోన్ కాల్స్ చేశాడు. నాగరాజు మాటలు నమ్మిన కొందరు క్రికెటర్‌ను స్పాన్సర్ చేస్తే మంచి పేరొస్తుందన్న నమ్మకంతో లక్షల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాయి పలు సంస్థలు.
గత ఏడాది మోసపోయిన ఓ సంస్థ ప్రతినిధులిచ్చిన ఫిర్యాదుతో నాగరాజును వల వేసి పట్టుకున్నారు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు. శుక్రవారం అదుపులోకి తీసుకున్న నాగరాజును.. శనివారం రిమాండ్‌కు తరలించారు. నాగరాజు మోసపు తెలివి తేటలు తెలుసుకుని కేటీఆర్ ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది.