Changes in AP property tax system: ఆస్తిపన్ను విధింపులో మార్పులు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం ఏడాది అద్దె (కిరాయి) విలువ ఆధారంగా ఆస్తిపన్ను లెక్కిస్తుండగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆస్తిపన్నును రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా లెక్కించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తిపన్ను చట్టానికి సవరణ చేస్తూ ఏపీ పురపాలక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
2021-22 ఆర్ధిక సంవత్సరం నుంచి ఆస్తి పన్నును రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా నిర్ధారించబోతున్నారు. ప్రస్తుతం ఏడాది అద్దె విలువ ప్రాతిపదికన ఆస్తి పన్నును లెక్కిస్తున్న ప్రభుత్వం .. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మార్పు తీసుకురానున్నది. తాజా మార్పు కారనంగా రిజిస్ట్రేషన్ విలువలను సవరించిన ప్రతీసారి ఆ మేరకు ఆస్తిపన్ను పెరగనున్నది. ఏడాది అద్దె విలువ ప్రాతిపదికన లెక్కించే పన్ను మొత్తం కంటే రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా గణించే పన్ను పదిశాతం కంటే ఎక్కువ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
ధార్మిక, విద్య, వైద్యం, స్మారక, సాంస్కృతిక కట్టడాలకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపునిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. సైనికులు, మాజీ సైనికుల గృహాలకు కూడా ఆస్తిపన్ను నుంచి మినహాయింపునిచ్చారు. 375 చదరపు అడుగులకు లోపు వున్న భవనాలకు వార్షిక ఆస్తిపన్ను 50 రూపాయలుగా నిర్ధారించారు. ఆస్తి విలువ ఖరారు చేసేందుకు భవనాలను నిర్మాణ శైలి ఆధారంగా వర్గీకరణ చేయబోతున్నారు. ఆర్సీసీ, పెంకులు, రేకులు, నాపరాళ్లు, పూరిళ్లకు వర్గీకరణ ఆధారంగా ఆస్తిపన్ను విధించనున్నారు. ఆస్తి పన్ను నిర్ధారణలో అక్రమ కట్టడాలకు 25 నుంచి 100 శాతం వరకు జరిమానా విధించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ALSO READ: కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..