మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆక్రోశం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆంబోతులా ఎగిరిపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తన పేరు మీద జపం చేస్తున్న వైసీపీ నేతలు తననెందుకు సభకు రాకుండా అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు. గత నాలుగు రోజులుగా ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారాయన.
శుక్రవారం అత్యంత ఉద్వేగంతో, ఆక్రోశంతో మాట్లాడారు టిడిపి అధినేత చంద్రబాబు. గతంలో తనను కాల్చమని, ఉరి తీయమని జగన్ కామెంట్లు చేశారని ఆరోపించారయన. తనను సస్పెండ్ చేస్తారా? దమ్ముంటే చేయమని సవాల్ చేశారు చంద్రబాబు.
టిడిపి నేతలపైనా, అధికారులపైనా జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు టిడిపి అధినేత. ఐ.ఆర్.ఎస్ అధికారి కృష్ణకిషోర్‌ను అవినీతి ఆరోపణలతో సస్పెండ్ చేసారని, నిజానికి జగన్‌కు చెందిన సంస్థలపై రిపోర్టు ఇచ్చినందుకే కృష్ణ కిషోర్‌పై జగన్ కక్ష కట్టారని చంద్రబాబు వివరించారు.
ముఖ్యమంత్రి జగన్ పన్నిన పన్నాగంలో పడొద్దని ఉద్యోగ సంఘాలకు బాబు విఙ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ వేదికగా జరుగుతున్నది రాజకీయ పోరాటమేనని, దీన్ని ఉద్యోగ సంఘాలు తమదిగా భావించవద్దని కోరారాయన. రివర్స్ టెండరింగ్ అని చెప్పుకుంటున్న ప్రక్రియ నిజానికి రిజర్వు టెండరింగ్ అని చంద్రబాబు అభివర్ణించారు.
ప్రభుత్వ కార్యాలయ భవనాలకు వైసీపీ రంగులు వేయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. ఈ చర్యను ఏపీ హైకోర్టు కూడా తప్పుపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అధికార గర్వంతో ఎగిసిపడడం కాదని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి హుందాగా నడచుకోవాలని అన్నారు చంద్రబాబు.