Modi government issued guidelines to all government offices: దేశవ్యాప్తంగా వున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కరోనా మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. కోవిడ్ వైరస్ నియంత్రణకు ఈ మార్గదర్శకాలను అమలు చేయడం తప్పనిసరి అని ఆదేశాలిచ్చింది కేంద్రం. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ స్కానర్లు ఏర్పాటు చేయాలన్నది మొట్టమొదటి నిబంధన. కార్యాలయాలలో తప్పనిసరిగా శానిటైజర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం తెలిపిన రెండో మార్గదర్శకం.
ఫ్లూ వ్యాధి లక్షణాలు ఉంటే చికిత్స అందిస్తూ క్వారంటైన్ తరిలించాలని సూచించింది కేంద్రం. కార్యాలయాలకు వచ్చే సందర్శకుల సంఖ్యను కట్టడి చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలలో జారీ చేసే విజిటర్ పాసులను రద్దు చేయాలని తెలిపింది. అధికారుల అనుమతితో వచ్చే సందర్శకులను స్క్రీనింగ్ తరువాతే లోనికి అనుమతించాలని సూచించింది. సమావేశాలను వీలైనంత వరకు కేవలం వీడియో కాన్ఫరెన్సులకే పరిమితం చేయాలని, తప్పనిసరి అయితే తప్ప వీలైనంత తక్కువ మందితోనే ప్రభుత్వ సమీక్షలు, సమావేశాలు జరపాలని మార్గదర్శకాలలో కేంద్రం పేర్కొంది.
ప్రాధాన్యత లేని, అంతగా అవసరం లేని అధికారిక ప్రయాణాలను రద్దు చేసుకోవాలని అధికారులకు, మంత్రుల సూచించింది కేంద్ర ప్రభుత్వం. సమాచారాన్ని చేతి ఫైళ్ళు, డాక్యుమెంట్ల రూపంలో ఇతర కార్యాలయాలకు పంపించ కుండా వీలైనంత వరకు ఈమెయిల్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని తెలిపింది. కార్యాలయం ఎంట్రీ పాయింట్ వద్ద నుండే దరఖాస్తులు తీసుకోవడం.. ఇవ్వడం చేయాలని, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో ఉన్న జిమ్స్, శిశు సంరక్షణ కేంద్రాలను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం తమ మార్గదర్శకాలలో పేర్కొన్నది.
ఉద్యోగులు పనిచేసే చోట తరచుగా శుభ్రం చేయాలని, శానిటేషన్ చేసుకోవాలని తెలిపింది. ప్రభుత్వ కార్యాలయంలోని వాష్ రూమ్, టాయిలెట్లను రెగ్యులర్‌గా శానిటైజర్ లేదా సబ్బులతో శుభ్రం చేయాలని, తగిన స్థాయిలో నీటి సరఫరా వుండేలా చర్యలు చేపట్టాలని కేంద్రం తెలిపింది. శ్వాస సంబధమైన ఇబ్బందులు, జ్వరం, అస్వస్థత ఉంటే ఉద్యోగ స్థానం నుండి వెళ్లిపోవాలి.. ఆ తరువాత ఉన్నతాధికారులకు ఇన్ఫార్మ్ చేయాలని.. అవసరమైతే వెంటనే హోమ్ క్వారంటైన్‌లోనే ఉండాలని నిర్దేశించింది కేంద్ర ప్రభుత్వం.
సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నవారి సెలవు రిక్వెస్ట్ మేరకు వెంటనే ఉన్నతాధికారులు సెలవు మంజూరు చేయాలని, సీనియర్ ఉద్యోగులు, గర్భిణీ ఉద్యోగులు, సీరియస్ రోగాలతో సీవియర్ కండిషన్‌లో వున్న ఉన్న ఉద్యోగులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశిస్తూ కేంద్రం ఉత్తర్వులు, మార్గదర్శకాలను జారీ చేసింది.